breaking news
Director General of Civil Aviation
-
మరో 220 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: ఇండిగో విమానాల సంక్షోభం కొనసాగుతూనే ఉంది. బుధవారం 220 విమానాలు రద్దయ్యాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటిదాకా 4,000కుపైగా విమానాలు రాకపోకలు సాగించలేదు. ఎక్కడికక్కడ ఎయిర్‌పోర్టుల్లోనే ఆగిపోయాయి. ఇండిగో నిర్వాకం వల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే, పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోందని, రద్దవుతున్న విమానాల సంఖ్య తగ్గిపోతోందని ఇండిగో వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇండిగో కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇండిగో ప్రధాన కార్యాలయంలో తమ సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇద్దరు ప్రభుత్వ అధికారులతో సహా ఎనిమిది మంది సీనియర్ కెపె్టన్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇండిగో గుర్గావ్ కార్యాలయంలో మకాం వేసి విమానాల రాకపోకలు, రద్దు, సిబ్బంది కొరత వంటి అంశాలను స్వయంగా పర్యవేక్షించనుంది. అలాగే డీజీసీకే నిత్యం నివేదిక సమరి్పస్తుంది. సీఈఓకు డీజీసీఏ సమన్లు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ డీజీసీఏ సమన్లు జారీ చేసింది. గురువారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సంక్షోభంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు 11 ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ఆపరేషన్లను స్వయంగా తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇందుకోసం నియమించిన ప్రత్యేక సిబ్బంది రాబోయే రెండు మూడు రోజుల్లో ఆయా ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేస్తారని వెల్లడించింది. సవరించిన విమానాల షెడ్యూల్‌ను ఇండిగో ఇప్పటికే డీజీసీఏకు సమరి్పంచింది. పరిహారం ఇవ్వాలి: ఢిల్లీ హైకోర్టు ఇండిగో విమానాల సంక్షోభంపై వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరిస్థితి చెయ్యిదాటిపోయే దాకా ఎందుకు వేచి చూశారని ఆక్షేపించింది. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. విమానాల రద్దు వల్ల నష్టపోయిన ప్రయాణికులకు తగిన పరిహారం ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఇందుకోసం చర్య లు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఇండిగో యా జమాన్యాన్ని ఆదేశించింది. విచారణ కమిటీ నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని స్పష్టంచేసింది. క్షమాపణ కోరిన ఇండిగో చైర్మన్ ఇండిగో విమానాల రద్దు, ఆలస్యంగా రాకపోకలు, ప్రయాణికుల ఇబ్బందులపై తమ ఎయిర్‌లైన్స్ బోర్డు పూర్తిస్థాయిలో అధ్యయనం చేయబోతున్నట్లు ఇండిగో చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా బుధవారం తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. సంక్షోభానికి మూల కారణం ఏమిటో తెలుసుకుంటామని, ఇందుకోసం టెక్నికల్ నిపుణుల సహాయం తీసుకుంటామని చెప్పారు. ప్రయాణికులను క్షమాపణ కోరుతున్నానని వ్యాఖ్యానించారు. వారి అంచనాలకు తగ్గట్టుగా తాము పని చేయలేకపోయామని అంగీకరించారు. వారం రోజుల్లో తమపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయని, అందులో కొన్ని సరైనవి, మరికొన్ని సరైనవి కానివి ఉన్నాయని విక్రమ్ సింగ్ మెహతా పేర్కొన్నారు. విమానాల రద్దు అనేది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు. -
ఇండిగో ఇంకా నేల మీదే!
సాక్షి, న్యూఢిల్లీ/ముంబై: దేశంలో ఇండిగో సంక్షోభం వరుసగా ఐదో రోజుకు చేరుకుంది. ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. శనివారం ఒక్కరోజే 800కుపైగా విమానాలు రద్దు కావడంతో ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న దృశ్యాలే కనిపించాయి. పైలట్ల విధులు, విశ్రాంతి విషయంలో పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల నుంచి తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. తగిన సంఖ్యలో పైలట్లు, విమాన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. శుక్రవారం వెయ్యికిపైగా విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంపై నాలుగు రోజులపాటు మౌనం పాటించిన ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్ ఎట్టకేలకు స్పందించారు. ప్రయాణికులను క్షమాపణ కోరారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. అసౌకర్యానికి మన్నించాలని విజ్ఞప్తి చేశారు. అతిత్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని, ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అన్ని శ్లాబుల్లో టికెట్ల లభ్యత గురించి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం అందించాలని ఎయిర్‌లైన్స్ సంస్థలకు పౌర విమానయాన శాఖ సూచించింది. డిమాండ్ పెరిగిన రూట్లలో అవసరమైతే విమానాల సంఖ్య పెంచాలని సూచించింది. ఏదైనా నగరానికి విమానాన్ని రద్దు చేస్తే ఆ మార్గంలో ఏ ఇతర సంస్థ కూడా చార్జీలు పెంచకూడదని ఆదేశించింది. విమానం రద్దు లేదా ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులో ఉన్న ప్రయాణికులకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని పేర్కొంది. సాధ్యమైన ప్రతి చోటా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టంచేసింది. తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని విమానయాన సంస్థలను హెచ్చరించింది. విమాన రుసుములపై నియంత్రణ ఇండిగో సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు చక్కగా సొమ్ము చేసుకుంటున్నాయి. విమాన చార్జీలను భారీగా పెంచేశాయి. ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. విమానయాన సంస్థల తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు ఊరట కలి్పస్తూ విమాన చార్జీలపై పరిమితి విధించింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. దూరాన్ని బట్టి చార్జీలను ఖరారు చేసింది. ఇవి రూ.7,500 నుంచి రూ.18,000 దాకా ఉన్నాయి. సంక్షోభం ముగిసేదాకా ఇవే చార్జీలు అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. టికెట్లను విమానయాన సంస్థల అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసినా లేక ప్రైవేట్ సంస్థల ఆన్లైన్ వేదికల నుంచి కొనుగోలు చేసినా ఈ చార్జీలనే వసూలు చేయాలని ఆదేశించింది. యూజర్ డెవలప్మెంట్ ఫీజు(యూడీఎఫ్), ప్యాసింజర్ సరీ్వసు ఫీజు(పీఎస్ఎఫ్), టిక్కెట్లపై పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బిజినెస్ క్లాస్ ప్రయాణాలు, ఉడాన్ విమానాలకు ఈ చార్జీల నియంత్రణ వర్తించదని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. కేవలం ఆదేశాలతో సరిపెట్టకుండా విమాన చార్జీల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తేల్చిచెప్పింది. ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు, ఎయిర్‌లైన్స్ డేటాను రియల్ టైంలో గమనిస్తామని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా.. ప్రజా ప్రయోజనాల దష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నేడు రాత్రి 8 గంటల్లోగా రీఫండ్ చేయండి రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికు లకు టికెట్ల రుసుమును తిరిగి చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ఇండిగోను పౌర విమానయాన శాఖ ఆదేశించింది. టికెట్ రీఫండ్ ఆదివారం రాత్రి 8 గంటల్లోగా పూర్తి కావాలని తేల్చిచెప్పింది. రీఫండ్ విషయంలో ఆదేశాలు పాటించకపోయినా, ఆలస్యం చేసినా చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని శనివారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. రీషెడ్యూలింగ్ విమానాల విషయంలో ప్రయాణికుల నుంచి అదనంగా చార్జీలు వసూలు చేయకూడదని సూచించింది. ప్రయాణికులకు సహకరించడానికి ప్రత్యేకంగా రీఫండ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇండిగోను ఆదేశించింది. సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ఈ కేంద్రాలను కొనసాగించాలని వెల్లడించింది. ఒకవేళ ప్రయాణికుల నుంచి బ్యాగేజీ తీసుకొని ఉంటే రెండు రోజుల్లోగా తిరిగి అందజేయాలని పేర్కొంది. నిబంధనల ప్రకారం అవసరమైన చోట ప్రయాణికులకు పరిహారం అందించాలని వెల్లడించింది. ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధులు, దివ్యాంగులైన ప్రయాణికులు, విద్యార్థులు, రోగులు, అత్యవసర ప్రయాణం అవసరమయ్యే వారందరికీ సరైన సౌకర్యాలు కల్పించడానికి పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేసినట్లు తెలిపింది. ఇండిగో సీఈఓపై వేటు పడుతుందా! దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికుల ఆగచాట్లకు కారణమైన ఇండిగో విమానాల రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్ అలసత్వమే ఈ సంక్షోభానికి దారి తీసినట్లు భావిస్తోంది. ఆయనపై వేటు వేయాలని దాదా పు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇండిగో సీఈఓ పదవి నుంచి పీటర్‌ను అతి త్వరలోనే తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఈవోకు డీజీసీఏ షోకాజ్ నోటీస్ ఇండిగోతో తలెత్తిన సంక్షోభం, విమానాల రాకపోకలకు అంతరాయం కలగడంపై వివరణ ఇవ్వాలని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శనివారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ‘పెద్ద సంఖ్యలో విమానాల రద్దుకు విపరీతమైన నిర్వహణా వైఫల్యాలు, ప్రణాళికా లోపమే కారణ మని భావిస్తున్నాం. సీఈవోగా మీరు, సంస్థ సమర్థ నిర్వహణకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే, కార్యకలాపాల నిర్వహణ, ముందు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించడమనే విధి నిర్వహణలో విఫలమయ్యారు’అని నోటీసులో పేర్కొంది. ఎఫ్డీటీఎల్ (ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్)ను సజావుగా అమలు చేయడానికి, సవరించిన నిబంధనలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లను చేయకపోవడమే అంతరాయాలకు ప్రధాన కారణమని భావిస్తున్నట్లు తెలిపింది. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఎల్బర్స్‌ను ఆదేశించింది.రీఫండ్‌కు అధిక ప్రాధాన్యం: ఇండిగో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఇండిగో శనివారం వెల్లడించింది. శుక్రవారంతో పోలిస్తే రద్దయిన విమానాల సంఖ్య శనివారం తగ్గినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. 850 కంటే తక్కువ విమానాలే రద్దయ్యాయని తెలిపింది. టికెట్ రీఫండ్ విషయంలో ప్రయాణికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. రీఫండ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, టికెట్ల చార్జీలు కచ్చితంగా తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఇందుకోసం వెబ్సైట్ లేదా కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించాలని సూచించింది. మరికొద్ది రోజుల్లోనే ఇబ్బందులు తొలగిపోతాయని వెల్లడించింది. విమానాల షెడ్యూళ్లలో స్థిరీకరణ, ఆలస్యాన్ని తగ్గించడం, ప్రయాణికులకు సహకరించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఇండిగో తెలియజేసింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ఇండిగో విమానాల రద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడానికి 84 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ శనివారం ప్రకటించింది. దేశమంతటా అన్ని జోన్లలో ఈ రైళ్లను ప్రారంభించినట్లు తెలియజేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పటా్న, హౌరా తదితర నగరాల మధ్య రైళ్లు ప్రారంభమయ్యాయని వివరించింది. ఇవి 104 ట్రిప్పులు నడుస్తాయని పేర్కొంది. ప్రయాణికుల అవసరాలను బట్టి ప్రత్యేక రైళ్ల సంఖ్య, ట్రిప్పుల సంఖ్యను మరింత పెంచనున్నట్లు వెల్లడించింది. లక్షలాది మందిని వారి గమ్యస్థానాలకు చేరవేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశామని రైల్వే బోర్డు ఉన్నతాధికారి దిలీప్ కుమార్ తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు, రాకపోకల సమయాన్ని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ప్రదర్శిస్తున్నారు. -
ఎయిర్‌బస్ ‘ఏ320’పై సౌరదాడి
న్యూఢిల్లీ: ప్రఖ్యాత ఎయిర్‌బస్ సంస్థ తయారుచేసిన ఏ320 మోడల్ విమానంపై సోలార్ రేడియేషన్ దాడి చేయడం, తద్వారా సాంకేతిక సమస్య తలెత్తడం ప్రపంచవ్యాప్తంగా ఇదే మోడల్ విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎయిర్‌బస్ సంస్థ సూచన మేరకు భారత్‌లోని విమానయాన సంస్థలు ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడం శనివారం ప్రారంభించాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు ఏ320 విమానాలను ఉపయోగిస్తున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సమాచారం ప్రకారం.. దేశంలో 338 ఏ320 మోడల్ విమానాలు ఉండగా, 270 విమానాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయ్యింది. అయితే, ఈ ప్రక్రియ కారణంగా వందలాది ఏ320 విమానాలు 60 నుంచి 90 నిమిషాలపాటు ఆలస్యంగా నడిచాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు విమానాలు రద్దయ్యాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకల్లా అన్ని విమానాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తవుతుందని, తర్వాత విమానాలు యథాతథంగా రాకపోకలు సాగిస్తాయని చెబుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా విమానాశ్రయాల్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రపంచమంతటా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 8,100 వరకు ఏ320 మోడల్ విమానాలు ఉపయోగంలో ఉన్నాయి. ఇందులో దాదాపు 6,000 విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ అవసరమని గుర్తించారు. కొన్నింటికి హార్డ్‌వేర్ కూడా మార్చాల్సి ఉందని అంటున్నారు. ఎయిర్‌బస్ సూచన మేరకు సంబంధిత విమానయాన సంస్థలు అదే పనిలో నిమగ్నమయ్యాయి. శుక్రవారం, శనివారం ప్రపంచమంతటా ఏ320 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలావరకు విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. వారాంతంలోనే ఈ సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు 5,000 విమానాల్లో సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్ పూర్తయ్యిందని, అవి తిరిగి కార్యకలాపాలు సాగిస్తున్నాయని, సాధారణ పరిస్థితి నెలకొందని ఎయిర్ బస్ ప్రతినిధులు చెప్పారు. మిగిలిన విమానాల్లో సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. అసలేం జరిగింది? అక్టోబర్ 30న మెక్సికో నుంచి అమెరికాలోని న్యూజెర్సీకి బయలుదేరిన జెట్‌బ్లూ ఎయిర్‌బస్ ఏ320 విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. విమానం ప్రయాణిస్తున్న ఎత్తు హఠాత్తుగా తగ్గిపోయింది. ఏడు సెకండ్ల వ్యవధిలో విమానం 100 అడుగుల మేర వేగంగా కిందికి దిగింది. దాంతో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని దారి మళ్లించి, అమెరికాలో ఫ్లోరిడా తీరంలోని తంపా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించారు. సోలార్ రేడియేషన్ కారణంగా విమానంలో ఎలివేటర్, ఎలిరాన్ కంప్యూటర్(ఈఎల్ఏసీ) వ్యవస్థలో మార్పులు వచి్చనట్లు గుర్తించారు. అందుకే విమానం హఠాత్తుగా కిందికి దిగినట్లు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ320 మోడల్ విమానాల్లో ఇలాంటి సమస్యే ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతో తక్షణమే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని ఎయిర్‌బస్ సంస్థ శుక్రవారం సూచించింది. లేకపోతే ఫ్లైట్ కంట్రోల్‌కు సంబంధించిన డేటా సోలార్ రేడియేషన్ వల్ల తారుమారయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. దీనిపై డీజీసీఏ వెంటనే స్పందించింది. భారత విమానయాన సంస్థలకు శనివారం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎయిర్‌బస్ సంస్థ నెదర్లాండ్స్ లో రిజిస్టర్ అయ్యింది. కానీ, ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల తయారీ సంస్థ. ఏ320 అనేది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న విమానం. -
మారుత్ ఏజీ–365ఎస్ డ్రోన్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్
హైదరాబాద్: బహుళ ప్రయోజనకారి అయిన ఏజీ–365ఎస్ వ్యవసాయ డ్రోన్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి టైప్ సర్టిఫికేషన్ లభించినట్లు మారుత్ డ్రోన్స్ తెలిపింది. చిన్న, మధ్య తరహా బ్యాటరీ ఆధారిత డ్రోన్లకు డీజీసీఏ నుంచి టైప్ సర్టిఫికేషన్ పొందిన తొలి సంస్థ తమదేనని పేర్కొంది. ఈ డ్రోన్‌ను ఇటు పురుగు మందుల పిచికారీ కోసం వ్యవసాయ రంగంతో పాటు అటు రిమోట్ పైలట్ ట్రెయినింగ్ (ఆర్పీటీవో)లో కూడా ఉపయోగించవచ్చని తెలిపింది. దీనితో డ్రోన్ ఎంట్రప్రెన్యూర్ రూ. 40,000 నుంచి రూ. 90,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు. అలాగే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి నామమాత్రంగా 5–6శాతం వడ్డీ రేటుతో రూ. 10 లక్షల వరకు తనఖా లేని రుణాన్ని పొందేందుకు కూడా ఈ డ్రోన్‌కు అర్హత ఉంటుందని వివరించారు. -
7 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా మహమ్మారి కోరలు చాచినా కానీ, మరోవైపు దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 2021 డిసెంబర్లో 6.7 శాతం పెరిగింది. మొత్తం 1.12 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం చేసినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. మొత్తం మీద 2021లో దేశీయ విమాన సర్వీసుల్లో 8.38 కోట్ల మంది ప్రయాణించారు. 2020లో 6.3 కోట్ల మందితో పోలిస్తే 33 శాతం పెరిగింది. కరోనా మహమ్మారి విమానయాన రంగంపై ఎక్కువ ప్రభావం చూపించడం తెలిసిందే. ఇండిగో వాటా 55 శాతం ► ఇండిగో విమానాల్లో 2021 డిసెంబర్లో 61.41 లక్షల మంది ప్రయాణించారు. మొత్తం ప్రయాణికుల్లో 54.8 శాతం ఇండిగోను ఎంచుకున్నారు. ► గోఫస్ట్ (గతంలో గోఎయిర్) విమానాల్లో 11.93 లక్షల మంది ప్రయాణించారు. ► స్పైస్‌జెట్ విమాన సర్వీసులను 11.51 లక్షల మంది వినియోగించుకున్నారు. సాధారణంగా రెండో స్థానంలో ఉండే స్పైస్‌జెట్ మూడో స్థానానికి పడిపోయింది. ► ఎయిర్ ఇండియా విమానాల్లో 9.89 లక్షల మంది, విస్తారా విమాన సర్వీసుల్లో 8.61 లక్షల మంది, ఎయిరేషియా విమానాల్లో 7.01 లక్షల మంది, అలియన్స్ ఎయిర్ సర్వీసుల్లో 1.25 లక్షల మంది చొప్పున ప్రయాణించారు. ► ఆక్యుపెన్సీ రేషియో లేదా లోడ్ ఫ్యాక్టర్ (సీట్ల భర్తీ)లో స్పైస్‌జెట్ మెరుగ్గా 86 శాతాన్ని డిసెంబర్లో నమోదు చేసింది. ఆ తర్వాత ఇండిగో 80.2%, విస్తారా 78.1%, గోఫస్ట్ 79%, ఎయిర్ ఇండియా 78.2 శాతం, ఎయిరేషియా 74.2% చొప్పున ఆక్యుపెన్సీ రేషియోను సాధించాయి. ► బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నగరాల నుంచి సకాలంలో సర్వీసులు నడిపించడంలో ఇండిగో 83.5 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ► గోఫస్ట్ 83 శాతం, విస్తారా 81.5 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ వాయిదా
న్యూఢిల్లీ/ జెనీవా/లాగోస్: అంతర్జాతీయ విమానాలను ఈ నెల 15 నుంచి పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో విమానాలను అనుకున్న ప్రకారం నడపకూడదని బుధవారం డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది. విమానాల రాకపోకలకు సంబంధించిన కొత్త తేదీపై నిర్ణయం తీసుకోలేదు. కోవిడ్ నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని కేంద్రం రద్దు చేసింది. ఈనెల 15 నుంచి పునరుద్ధరించాలని గత నెల 26న నిర్ణయించింది. తర్వాత ఒమిక్రాన్ కలకలం రేగడంతో పునరుద్ధరణను వాయిదావేసింది. దేశంలో ఈ కేసు లు లేకున్నా గట్టి చర్యలు తీసుకుంటోంది. నిషేధంతో అరికట్టలేరు: డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించినంత మాత్రాన ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పట్నుంచి ఆఫ్రికా దేశాలను లక్ష్యంగా చేసుకొని పలు దేశాలు విమానాల రాకపోకల్ని నిషేధిస్తూ ఉండడంతో డబ్ల్యూహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రాయాసెస్ స్పందించారు. ప్రయాణాలను నిషేధిస్తే మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ వేసుకోని వారు, 60 ఏళ్ల పైబడిన వారు ప్రయాణాలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, అమెరికాలో ఒమిక్రాన్ తొలి కేసు కాలిఫోర్నియాలో బుధవారం నమోదైంది. దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో ఒమిక్రాన్ పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఒమిక్రాన్ వేరియెంట్ అక్టోబర్‌లో బయటపడింది. ఈ వేరియెంట్‌పై ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా హెచ్చరించడానికి ముందే నైజీరియాలో ఇది వెలుగులోకి వచ్చిందని ఆ దేశ ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. ‘గత వారంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నమూనాలో జన్యుక్రమాన్ని పరిశీలిస్తే ఒమిక్రాన్ కేసులు అని తేలింది. ఆ నమూనాలు పరీక్షించినప్పుడే అక్టోబర్‌లో సేకరించిన శాంపిళ్లనూ పరీక్షిస్తే ఒమిక్రాన్ వేరియెంట్‌గా నిర్ధారణ అయింది. అంటే రెండు నెలల కిందటే ఒమిక్రాన్ వేరియెంట్ పుట్టుకొచ్చిందని అర్థమవుతోంది’ అని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. -
మాస్క్ సరిగా లేకుంటే దింపేయండి
ముంబై: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? మాస్కు ధరించారా? అది ముక్కు కిందికో, గడ్డానికో ధరిస్తే సరిపోదు. ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచాలి. అలా లేకపోతే నిర్దాక్షిణ్యంగా విమానం నుంచి దింపేస్తారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) దేశంలో అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. విమానాల్లో కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికుల పట్ల దయ చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండడంతో పౌర విమానయాన సంస్థలకు డీజీసీఏ శనివారం నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సక్రమంగా ధరించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీసీఏను, విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాల్లో తరచుగా తనిఖీలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు డీజీసీఏ సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో ఏముందంటే... ► మాస్కులు లేనివారిని ఎయిర్‌పోర్టుల్లోకి అనుమతించరాదు. ► విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సరిగ్గా ధరించేలా, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. ► విమానాశ్రయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రయాణం ముగిశాక విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేదాకా మాస్కు ఉండాల్సిందే. ► కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను ఎలాంటి రాజీ లేకుండా కఠినంగా అమలు చేయాలి. ► విమానం బయలుదేరే ముందు పదేపదే సూచించినా మాస్కు సరిగ్గా ధరించకపోతే సదరు ప్రయాణికుడిని వెంటనే దింపేయాలి. ► విమానం ప్రయాణిస్తుండగా మాస్కులు సరిగ్గా లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వారిని నిబంధనలు అతిక్రమించిన ప్రయాణికులుగా పరిగణించాలి. ► కొన్ని అత్యవసర సందర్భాల్లో మినహా మిగిలిన సమయంలో మాస్కును ముక్కు నుంచి కిందకు జార్చరాదు. ► కోవిడ్–19 నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డీజీసీఏ గైడ్‌లైన్స్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి. -
లగేజీ తక్కువుంటే ధర కూడా తక్కువే
న్యూఢిల్లీ :మీకు ఎక్కువగా లగేజీ లేదా ? చిన్న బ్యాగుతోనే విమానంలో ప్రయాణించాలనుకుం టున్నారా ? అయితే మీ టిక్కెట్ ధర మరింత చౌకగా లభించనుంది. కేవలం కేబిన్ లగేజీ మాత్రమే ఉన్నవారికి దేశీయ విమానాల్లోని టిక్కెట్ ధరల్లో డిస్కౌంట్ ఇవ్వడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విమాన ప్రయాణికులు కేబిన్ లగేజీ కింద 7 కేజీలు, చెక్ ఇన్ లగేజీ కింద 15 కేజీలు తీసుకువెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ బరువున్న సామాన్లు తీసుకువెళితే అదనపు చార్జీలు ఉంటాయి. అయితే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రయాణికులు టిక్కెట్ బుకింగ్ సమయంలోనే తాము ఎంత బరువైన లగేజీ తీసుకువెళతారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. అప్పుడే తక్కువ లగేజీ ఉన్నవారికి టిక్కెట్ డిస్కౌంట్ ధరకి వస్తుందని తెలిపింది. ప్రత్యేకంగా ఒక సీటు కావాలన్నా, భోజనం, స్నాక్స్, డ్రింక్స్ అడిగినా, మ్యూజిక్ వినాలనుకున్నా విమానయాన సంస్థలు అదనపు చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఈ సర్వీసులు అవసరం లేని ప్రయాణికుల వాటిని ఎంచుకోకపోతే టిక్కెట్« ధర తగ్గుతుంది. అదే విధంగా లగేజీ లేకపోతే టిక్కెట్ ధర తక్కువకి వచ్చే సదుపాయాన్ని డీజీసీఏ ప్రయాణికులకు కల్పించింది. విమానయాన సంస్థలను నష్టాల నుంచి బయటపడేయడానికి కేంద్రం విమాన చార్జీలను 10–30శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. ప్రయాణికులకు కూడా ఊరట కల్పించడానికి ఈ విధానాన్ని తీసుకువచ్చింది. -
తొలగిన అడ్డంకులు
సాక్షి, ముంబై: కొల్హాపూర్ జిల్లా వాసులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన విమాన ప్రయాణికులకు శుభవార్త. కొల్హాపూర్ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సేవలు త్వరలో పునఃప్రారంభం కానున్నాయి. కేంద్ర విమానయాన శాఖ ఇటీవల నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేసింది. దీంతో విమాన సేవలను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. రెండున్నర సంవత్సరాలుగా ఎన్ఓసీ లేనికారణంగా విమాన సేవలు మొదలుకాలేదు. వచ్చే 15-20 రోజుల్లో కేంద్ర విమానయాన శాఖ పరీక్షలు నిర్వహించనుంది. ఆ తరువాత ప్రయాణికుల రాకపోకలకు అనుమతిస్తారు.ఈ విమానాశ్రయంలో రన్ వే దెబ్బతిన్న కారణంగా 2010, జూన్‌లో విమాన సేవలను నిలిపివేశారు. కొద్దిరోజుల తరువాత రన్‌వేకు మరమ్మతు పనులను పూర్తిచేశారు. ఆ తర్వాత కేవలం మూడు నెలలు మాత్రమే విమానాల రాకపోకలు సాగాయి. ఆ తర్వాత పలు విమానసంస్థలు మూత పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రన్ వే పొడవు తక్కువగా ఉన్న కారణంగా భారీ విమానాలు ల్యాండింగ్ కావడానికి వీల్లేకుండా ఉంది. దీంతో అనేక విమాన కంపెనీలు కొల్హాపూర్‌కు విమాన సేవలను అందించలేదు. హోం శాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్, ఎంపీ ధనంజయ్ మహాడిక్ విమాన సేవలు మళ్లీ మొదలయ్యేవిధంగా చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు రన్ వే పొడవు, వెడల్పు పెంచడంతో కేంద్ర విమానయాన శాఖ ఎన్ఓసీ జారీ చేసింది. దీంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. పరీక్షలు పూర్తయిన తరువాత ముంబై-కొల్హాపూర్ మధ్య తొలుత విమాన సేవలు ప్రారంభమైతాయి. ఆ తరువాత ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మిగతా ప్రాంతాలకు సేవలు విస్తరిస్తారని మహాడిక్ తెలిపారు.


