తొలగిన అడ్డంకులు | Kolhapur airport gets civil aviation ministry’s approval | Sakshi
Sakshi News home page

తొలగిన అడ్డంకులు

Sep 3 2014 10:15 PM | Updated on Sep 2 2017 12:49 PM

కొల్హాపూర్ జిల్లా వాసులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన విమాన ప్రయాణికులకు శుభవార్త.

 సాక్షి, ముంబై: కొల్హాపూర్ జిల్లా వాసులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన విమాన ప్రయాణికులకు శుభవార్త. కొల్హాపూర్ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సేవలు త్వరలో పునఃప్రారంభం కానున్నాయి. కేంద్ర విమానయాన శాఖ ఇటీవల నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేసింది. దీంతో విమాన సేవలను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. రెండున్నర సంవత్సరాలుగా ఎన్‌ఓసీ లేనికారణంగా విమాన సేవలు మొదలుకాలేదు. వచ్చే 15-20 రోజుల్లో కేంద్ర విమానయాన శాఖ పరీక్షలు నిర్వహించనుంది.

 ఆ తరువాత ప్రయాణికుల రాకపోకలకు అనుమతిస్తారు.ఈ విమానాశ్రయంలో రన్ వే దెబ్బతిన్న కారణంగా 2010, జూన్‌లో విమాన సేవలను నిలిపివేశారు. కొద్దిరోజుల తరువాత రన్‌వేకు మరమ్మతు పనులను పూర్తిచేశారు. ఆ తర్వాత కేవలం మూడు నెలలు మాత్రమే విమానాల రాకపోకలు సాగాయి. ఆ తర్వాత పలు విమానసంస్థలు మూత పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రన్ వే పొడవు తక్కువగా ఉన్న కారణంగా భారీ విమానాలు ల్యాండింగ్ కావడానికి వీల్లేకుండా ఉంది.

దీంతో అనేక విమాన కంపెనీలు కొల్హాపూర్‌కు విమాన సేవలను అందించలేదు. హోం శాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్, ఎంపీ ధనంజయ్ మహాడిక్ విమాన సేవలు మళ్లీ మొదలయ్యేవిధంగా చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు రన్ వే పొడవు, వెడల్పు పెంచడంతో కేంద్ర విమానయాన శాఖ ఎన్‌ఓసీ జారీ చేసింది. దీంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. పరీక్షలు పూర్తయిన తరువాత ముంబై-కొల్హాపూర్ మధ్య తొలుత విమాన సేవలు ప్రారంభమైతాయి. ఆ తరువాత ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మిగతా ప్రాంతాలకు సేవలు విస్తరిస్తారని మహాడిక్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement