ఇండిగో ఇంకా నేల మీదే!  | More than 800 IndiGo flights were canceled, DGCA issues show-cause notice to airline CEO | Sakshi
Sakshi News home page

ఇండిగో ఇంకా నేల మీదే! 

Dec 7 2025 4:26 AM | Updated on Dec 7 2025 4:34 AM

More than 800 IndiGo flights were canceled, DGCA issues show-cause notice to airline CEO

ఐదో రోజూ ప్రయాణికులకు తీరని ఇక్కట్లు  

ఒక్కరోజే 800కుపైగా విమానాలు రద్దు  

ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినా అదే పరిస్థితి  

ప్రయాణికులను క్షమాపణ కోరిన సీఈఓ పీటర్‌ ఎల్‌బెర్స్‌  

త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వెల్లడి  

టికెట్‌ రీఫండ్‌ చేయాలని ఇండిగోకు పౌర విమానయాన శాఖ ఆదేశం  

విమాన చార్జీలపై పరిమితి విధించిన ప్రభుత్వం  

దూరాన్ని బట్టి రూ.7,500 నుంచి రూ.18,000 దాకా రుసుములు   

సాక్షి, న్యూఢిల్లీ/ముంబై: దేశంలో ఇండిగో సంక్షోభం వరుసగా ఐదో రోజుకు చేరుకుంది. ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. శనివారం ఒక్కరోజే 800కుపైగా విమానాలు రద్దు కావడంతో ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న దృశ్యాలే కనిపించాయి. పైలట్ల విధులు, విశ్రాంతి విషయంలో పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ) ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌ (ఎఫ్‌డీటీఎల్‌) నిబంధనల నుంచి తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. 

తగిన సంఖ్యలో పైలట్లు, విమాన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. శుక్రవారం వెయ్యికిపైగా విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంపై నాలుగు రోజులపాటు మౌనం పాటించిన ఇండిగో సంస్థ సీఈఓ పీటర్‌ ఎల్‌బెర్స్‌ ఎట్టకేలకు స్పందించారు. ప్రయాణికులను క్షమాపణ కోరారు. ఈ మేరకు శనివారం సోషల్‌ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. అసౌకర్యానికి మన్నించాలని విజ్ఞప్తి చేశారు. అతిత్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని, ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.   

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి  
అన్ని శ్లాబుల్లో టికెట్ల లభ్యత గురించి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం అందించాలని ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు పౌర విమానయాన శాఖ సూచించింది. డిమాండ్‌ పెరిగిన రూట్లలో అవసరమైతే విమానాల సంఖ్య పెంచాలని సూచించింది. ఏదైనా నగరానికి విమానాన్ని రద్దు చేస్తే ఆ మార్గంలో ఏ ఇతర సంస్థ కూడా చార్జీలు పెంచకూడదని ఆదేశించింది. విమానం రద్దు లేదా ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులో ఉన్న ప్రయాణికులకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని పేర్కొంది. సాధ్యమైన ప్రతి చోటా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టంచేసింది. తమ ఆదేశాలను అమలు చేయడంలో 
విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని విమానయాన సంస్థలను హెచ్చరించింది.    

విమాన రుసుములపై నియంత్రణ  
ఇండిగో సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు చక్కగా సొమ్ము చేసుకుంటున్నాయి. విమాన చార్జీలను భారీగా పెంచేశాయి. ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. విమానయాన సంస్థల తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు ఊరట కలి్పస్తూ విమాన చార్జీలపై పరిమితి విధించింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. దూరాన్ని బట్టి చార్జీలను ఖరారు చేసింది. ఇవి రూ.7,500 నుంచి రూ.18,000 దాకా ఉన్నాయి. సంక్షోభం ముగిసేదాకా ఇవే చార్జీలు అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది.

 టికెట్లను విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేసినా లేక ప్రైవేట్‌ సంస్థల ఆన్‌లైన్‌ వేదికల నుంచి కొనుగోలు చేసినా ఈ చార్జీలనే వసూలు చేయాలని ఆదేశించింది. యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు(యూడీఎఫ్‌), ప్యాసింజర్‌ సరీ్వసు ఫీజు(పీఎస్‌ఎఫ్‌), టిక్కెట్లపై పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణాలు, ఉడాన్‌ విమానాలకు ఈ చార్జీల నియంత్రణ వర్తించదని పౌర విమానయాన శాఖ వెల్లడించింది.  కేవలం ఆదేశాలతో సరిపెట్టకుండా విమాన చార్జీల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తేల్చిచెప్పింది. ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫామ్‌లు, ఎయిర్‌లైన్స్‌ డేటాను రియల్‌ టైంలో గమనిస్తామని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా.. ప్రజా ప్రయోజనాల దష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  

నేడు రాత్రి 8 గంటల్లోగా రీఫండ్‌ చేయండి  
రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికు లకు టికెట్ల రుసుమును తిరిగి చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ఇండిగోను పౌర విమానయాన శాఖ ఆదేశించింది. టికెట్‌ రీఫండ్‌ ఆదివారం రాత్రి 8 గంటల్లోగా పూర్తి కావాలని తేల్చిచెప్పింది. రీఫండ్‌ విషయంలో ఆదేశాలు పాటించకపోయినా, ఆలస్యం చేసినా చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని శనివారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. రీషెడ్యూలింగ్‌ విమానాల విషయంలో ప్రయాణికుల నుంచి అదనంగా చార్జీలు వసూలు చేయకూడదని సూచించింది. 

ప్రయాణికులకు సహకరించడానికి ప్రత్యేకంగా రీఫండ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇండిగోను ఆదేశించింది. సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ఈ కేంద్రాలను కొనసాగించాలని వెల్లడించింది. ఒకవేళ ప్రయాణికుల నుంచి బ్యాగేజీ తీసుకొని ఉంటే రెండు రోజుల్లోగా తిరిగి అందజేయాలని పేర్కొంది. నిబంధనల ప్రకారం అవసరమైన చోట ప్రయాణికులకు పరిహారం అందించాలని వెల్లడించింది. ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధులు, దివ్యాంగులైన ప్రయాణికులు, విద్యార్థులు, రోగులు, అత్యవసర ప్రయాణం అవసరమయ్యే వారందరికీ సరైన సౌకర్యాలు కల్పించడానికి పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేసినట్లు తెలిపింది.  

ఇండిగో సీఈఓపై వేటు పడుతుందా!  
దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికుల ఆగచాట్లకు కారణమైన ఇండిగో విమానాల రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ సంస్థ సీఈఓ పీటర్‌ ఎల్‌బెర్స్‌ అలసత్వమే ఈ సంక్షోభానికి దారి తీసినట్లు భావిస్తోంది. ఆయనపై వేటు వేయాలని దాదా పు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇండిగో సీఈఓ పదవి నుంచి పీటర్‌ను అతి త్వరలోనే తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

సీఈవోకు డీజీసీఏ షోకాజ్‌ నోటీస్‌ 
ఇండిగోతో తలెత్తిన సంక్షోభం, విమానాల రాకపోకలకు అంతరాయం కలగడంపై వివరణ ఇవ్వాలని ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌కు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) శనివారం షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. ‘పెద్ద సంఖ్యలో విమానాల రద్దుకు విపరీతమైన నిర్వహణా వైఫల్యాలు, ప్రణాళికా లోపమే కారణ మని భావిస్తున్నాం. 

సీఈవోగా మీరు, సంస్థ సమర్థ నిర్వహణకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే, కార్యకలాపాల నిర్వహణ, ముందు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించడమనే విధి నిర్వహణలో విఫలమయ్యారు’అని నోటీసులో పేర్కొంది. ఎఫ్‌డీటీఎల్‌ (ఫ్లైట్‌ డ్యూటీ టైం లిమిటేషన్స్‌)ను సజావుగా అమలు చేయడానికి, సవరించిన నిబంధనలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లను చేయకపోవడమే అంతరాయాలకు ప్రధాన కారణమని భావిస్తున్నట్లు తెలిపింది. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఎల్బర్స్‌ను ఆదేశించింది.

రీఫండ్‌కు అధిక ప్రాధాన్యం: ఇండిగో  
పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఇండిగో శనివారం వెల్లడించింది. శుక్రవారంతో పోలిస్తే రద్దయిన విమానాల సంఖ్య శనివారం తగ్గినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. 850 కంటే తక్కువ విమానాలే రద్దయ్యాయని తెలిపింది. టికెట్‌ రీఫండ్‌ విషయంలో ప్రయాణికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. రీఫండ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, టికెట్ల చార్జీలు కచ్చితంగా తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఇందుకోసం వెబ్‌సైట్‌ లేదా కస్టమర్‌ సపోర్ట్‌ టీమ్‌ను సంప్రదించాలని సూచించింది. మరికొద్ది రోజుల్లోనే ఇబ్బందులు తొలగిపోతాయని వెల్లడించింది. విమానాల షెడ్యూళ్లలో స్థిరీకరణ, ఆలస్యాన్ని తగ్గించడం, ప్రయాణికులకు సహకరించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఇండిగో తెలియజేసింది.    

ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు  
ఇండిగో విమానాల రద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడానికి 84 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ శనివారం ప్రకటించింది. దేశమంతటా అన్ని జోన్లలో ఈ రైళ్లను ప్రారంభించినట్లు తెలియజేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పటా్న, హౌరా తదితర నగరాల మధ్య రైళ్లు ప్రారంభమయ్యాయని వివరించింది. ఇవి 104 ట్రిప్పులు నడుస్తాయని పేర్కొంది. ప్రయాణికుల అవసరాలను బట్టి ప్రత్యేక రైళ్ల సంఖ్య, ట్రిప్పుల సంఖ్యను మరింత పెంచనున్నట్లు వెల్లడించింది. లక్షలాది మందిని వారి గమ్యస్థానాలకు చేరవేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశామని రైల్వే బోర్డు ఉన్నతాధికారి దిలీప్‌ కుమార్‌ తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు, రాకపోకల సమయాన్ని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ప్రదర్శిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement