పొగమంచు గుప్పిట్లో విమానయానం | IndiGo latest Flight Cancellations updates | Sakshi
Sakshi News home page

పొగమంచు గుప్పిట్లో విమానయానం

Dec 20 2025 2:26 PM | Updated on Dec 20 2025 2:46 PM

IndiGo latest Flight Cancellations updates

ఉత్తర భారత దేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు విమాన ప్రయాణికులకు చుక్కలు చూపుతోంది. శీతాకాలం తీవ్రత పెరగడంతో విజబిలిటీ(Visibility-దృశ్యమానత) కనిష్ట స్థాయికి పడిపోయి, విమాన సర్వీసులు ఒక్కసారిగా రద్దయ్యాయి. ముఖ్యంగా ఇటీవల పెద్ద మొత్తంలో విమానాలు రద్దు చేసిన ఇండిగో ఈమేరకు మళ్లీ శనివారం (డిసెంబర్ 20) సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

80కి పైగా సర్వీసులు రద్దు

ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం దేశవ్యాప్తంగా 80కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అంతకుముందు శుక్రవారం కూడా ఢిల్లీ విమానాశ్రయం నుంచి 73 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులతో కలిపి మొత్తం 79 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రాంచీ, జమ్మూ, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం అత్యధికంగా ఉంది. ‘వాతావరణ పరిస్థితులను మేము నిశితంగా గమనిస్తున్నాం. మీ ప్రయాణం సురక్షితంగా సాగేలా మా బృందాలు కృషి చేస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చే ముందే తమ విమాన స్థితిని (Flight Status) తనిఖీ చేసుకోవాలి’ అని ఇండిగో తన తాజా అడ్వైజరీలో పేర్కొంది.

ఢిల్లీలో ‘లో విజిబిలిటీ’ అలర్ట్

దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పొగమంచు ధాటికి విలవిలలాడుతోంది. విమానాశ్రయంలో ‘లో విజిబిలిటీ ప్రొసీజర్స్’ అమలులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ, దృశ్యమానత తగ్గితే మరిన్ని విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

గోవాలో ఊరట

ఉత్తరాది అంతా పొగమంచుతో ఇబ్బంది పడుతుంటే పర్యాటక రాష్ట్రం గోవాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. డిసెంబర్ 20న గోవా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవాల్సిన 38 ఇండిగో విమానాలు ఎటువంటి ఆటంకం లేకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుండటం ప్రయాణికులకు కొంత ఊరటనిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement