ఇరాన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. అగ్రరాజ్యం అమెరికా దాడులు చేస్తుందనే కారణంగా ఇరాన్.. అకస్మాత్తుగా తన గగనతలాన్ని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, గగనతం మూసివేస్తున్న సమయంలో ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. దీంతో, ఇండిగో సంస్థ, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ గురువారం తెల్లవారుజామున ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించే సమయానికి చాలా విమానాలు తమ మార్గాలను మళ్లించుకున్నాయి. అయితే, ఈ మూసివేత ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇరాన్ గగనతలంలో భారత్‌కు చెందిన ఇండిగో విమానం ప్రయాణంలో ఉంది. జార్జియాలోని టీబీలిసీ నుంచి వస్తున్న ఇండిగో 6E-1808 విమానం ఇరాన్ తన బోర్డర్లను మూసివేయడానికి సరిగ్గా నిమిషాల ముందు గగనతలం చివరి వరకు వచ్చేసింది. సరైన సమయంలో సదరు ఇండిగో విమానం.. ఇరాన్ సరిహద్దులు దాటి పాకిస్తాన్ గగనతంలోకి ప్రవేశించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా, ఆ సమయంలో ఇరాన్ భూభాగంపై ఉన్న ఏకైక 'నాన్-ఇరానియన్' విమానం ఇండిగోనే కావడం గమనార్హం.
విమానయాన సంస్థల సూచనలు..
ఇక, ప్రస్తుతానికి ఇరాన్ గగనతలం అనిశ్చితంగా ఉన్నందున భారత విమానయాన శాఖ (DGCA) పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రయాణికులు తమ విమాన సమయాలను సరిచూసుకోవాలని సూచించింది. భారత విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తామిచ్చే సూచనలు గమనించుకోవాలని ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని ఎయిరిండియా తెలిపింది. ఇండిగో కూడా ఇలాంటి సూచనలే జారీ చేసింది. ఇరాన్ గగనతలం మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని పేర్కొంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.
కేంద్రం అడ్వైజరీ..
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఇరాన్‌లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. భారతీయులు వెంటనే దేశం వీడాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఉద్యమ స్థలాల వైపు వెళ్లొద్దని, ఎంబసీ వద్ద తమ పేర్లను నమోదుచేసుకోవాలని తమ పౌరులకు రాయబార కార్యాలయం సూచించింది. అలాగే, ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్‌లోని పౌరులకు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది.
IndiGo flight 6E1808 is now the last non-Iran-registered passenger aircraft in Iranian airspace. pic.twitter.com/qEAU83gYrK
— Chendur.Vengat (@coolvnkt) January 14, 2026
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురవుతున్న హెచ్చరికలు, ఇరాన్ అంతర్గత అశాంతి నేపథ్యంలో టెహ్రాన్ తన గగనతలాన్ని శత్రు విమానాలకు దొరక్కుండా మూసివేసింది. కమర్షియల్ విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇరాన్ గగనతంలో జరిగిన విమాన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ గగనతలం మూసివేతతో భారత్ నుంచి యూరప్, అమెరికా వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం పడింది.


