ఢిల్లీ: ఇండిగో సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారీ షాక్ ఇచ్చింది. రూ.22.20 కోట్ల జరిమానా విధించింది. గత డిసెంబర్‌లో విమానాల రద్దు, ఆలస్యంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డ సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దుకావడంపై దర్యాప్తు చేపట్టిన డీజీసీఏ.. కఠిన చర్యలకు ఉపక్రమించింది.
భారీ సంఖ్యలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడటంతో నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందజేసింది. రిపోర్టు ఆధారంగా జరిమానా విధిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ప్రణాళికా లోపాలు, నిర్వహణ, నియంత్రణ వైఫల్యాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది.
2025 డిసెంబర్ 3 నుండి 5 మధ్య కాలంలో భారీ ఎత్తున విమానాలు ఆలస్యం కావడంతో పాటు వేలాది సర్వీసులు రద్దయ్యాయి. ఈ మూడు రోజుల్లో ఇండిగో 2,507 విమానాలను రద్దు చేయగా, 1,852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో మూడు లక్షల మందికి పైగా ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇండిగో మాతృ సంస్థ అయిన 'ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్' బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఈ జరిమానాపై స్పందిస్తూ, తాము DGCA ఉత్తర్వులను అందుకున్నామని ధృవీకరించారు.
ఇండిగో బోర్డు, మేనేజ్‌మెంట్ ఈ ఉత్తర్వులను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకుంటాయి. సకాలంలో తగిన చర్యలు చేపడతాము," అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గత 19 ఏళ్ల ప్రస్థానంలో తమకు ఉన్న మంచి రికార్డును కాపాడుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లోతైన సమీక్ష చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.


