ముంబై: దేశవ్యాప్తంగా వివిధ విమానా శ్రయాల్లో అననుకూల వాతావరణం కారణంగా శనివారం 57 విమానాలను రద్దు చేసినట్లు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తెలిపింది. అదేవిధంగా, ఆదివారం నడిపే మరో 13 విమానాలను సైతం రద్దు చేసింది. వీటిలో రెండు నిర్వహణ పరమైన కారణాలు, మిగతావి ప్రతికూల వాతావరణం నెలకొనవచ్చనే అంచనాతో రద్దు చేశామని వెల్లడించింది.
ఈ నెలారంభంలో నిర్వహణ పరమైన కారణాలు చూపుతూ వేలాదిగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో తీవ్ర సంక్షోభం తలెత్తడం తెల్సిందే. అదేవిధంగా, గత వారం, పది రోజులుగా ఈ సంస్థ వాతావరణం సరిగా లేదనే కారణంతో పదుల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేస్తోంది. శనివారం రద్దయిన వాటిలో చండీగఢ్, అహ్మదాబాద్, హైదరాబాద్, అమృత్‌సర్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, పుణె మొదలైన చోట్ల నుంచి రాకపోకలు సాగించాల్సినవి ఉన్నాయి.


