సెజ్‌ ఔషధాలకు ట్యాక్స్‌ రిలీఫ్‌ | Exemption from customs and excise duties for development of SEZs | Sakshi
Sakshi News home page

సెజ్‌ ఔషధాలకు ట్యాక్స్‌ రిలీఫ్‌

Dec 25 2025 1:28 AM | Updated on Dec 25 2025 1:28 AM

Exemption from customs and excise duties for development of SEZs

దేశీయంగా లభ్యతను పెంచడంపై ఫోకస్‌ 

బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశం 

ముందుగా కొన్ని ఉత్పత్తులకే పరిమితం 

న్యూఢిల్లీ: దేశీయంగా కీలక ఔషధాల లభ్యత పెరిగేలా, ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్‌) తయారు చేసి, దేశీయంగా విక్రయించే ఔషధాలపై కస్టమ్స్‌ సుంకాలను ఎత్తివేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెజ్‌లలో తయారై, దేశీయ మార్కెట్లో అమ్మే ఔషధాలపై 10 శాతం సుంకాలు వర్తిస్తున్నాయి. 

ఒకవేళ తాజా ప్రతిపాదన ఆచరణ రూపం దాలిస్తే సదరు సుంకాల ప్రస్తావన లేకుండా పలు టీకాలు, కీలక ఔషధాలను దేశీయంగా తక్కువ ధరకే విక్రయించేందుకు వీలవుతుంది. అయితే, ఏకమొత్తంగా అన్ని ఔషధాలకు కాకుండా కొన్ని ఉత్పత్తులకు మాత్రమే మినహాయింపులను వర్తింప చేయొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఈ మేరకు ప్రతిపాదనను చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా ఎంపిక చేసిన కొన్ని టీకాలు, కొన్ని కీలకమైన ఔషధాలు, ప్రభుత్వం నిర్ణయించే ఉత్పత్తులకు మినహాయింపునివ్వొచ్చని పేర్కొన్నాయి.  

వైద్య పరికరాలకు కూడా.. 
దేశీయంగా స్టార్టప్‌ వ్యవస్థని కూడా ప్రోత్సహించే దిశగా కొన్ని మెడికల్‌ డివైజ్‌ల తయారీ సంస్థలు, బయోటెక్‌ సంస్థలకు కూడా ఇదే తరహాలో సుంకాల నుంచి మినహాయింపులనిచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్న ఉత్పత్తులను, దేశీయంగా తయారు చేసేందుకు పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి.

 మన ఫార్మా రంగం గణనీయంగా ఎదుగుతోందని, పలు రాష్ట్రాలు ఫార్మా సెజ్‌లను ఏర్పాటు చేస్తున్నాయని వివరించాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రతిపాదనలు తోడ్పడగలవని వివరించాయి. 

అక్టోబర్‌ 1 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా 100 శాతం సుంకాలను ప్రకటించడంతో దేశీయంగా ఔషధాలను విక్రయించుకునేందుకు సుంకాల నుంచి మినహాయింపునివ్వాలంటూ సెజ్‌ యూనిట్లు కోరుతుండటంతో ప్రభుత్వ తాజా యోచన ప్రాధాన్యం సంతరించుకుంది. సెజ్‌ల నుంచి ఎగుమతవుతున్న ఉత్పత్తుల్లో హైపర్‌టెన్షన్, మధుమేహం, కార్డియోవాసు్కలర్‌ వ్యాధుల్లాంటి వాటి చికిత్స కోసం ఉపయోగించే ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్టబుల్‌ ఔషధాలు ఉంటున్నాయి. వీటికి దేశీ మార్కెట్లో కూడా గణనీయంగా డిమాండ్‌ ఉంటోంది. ప్రస్తుతం దేశీ ఫార్మా మార్కెట్‌ 60 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు అంచనా. భారత్‌కి అంతర్జాతీయంగా జనరిక్‌ ఔషధాల విభాగంలో 20 శాతం వాటా, టీకాల సరఫరాలో 60 శాతం వాటా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement