
భారత ప్రభుత్వం ప్రకటన
ఇరుదేశాల ప్రధానులు మోదీ, నవీన్ చంద్ర భేటీ
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఏడు ఒప్పందాలపై సంతకాలు
వారణాసి: మారిషస్‌కు 680 మిలియన్ డాలర్ల(రూ.6,004 కోట్లు) ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గూలామ్ గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సమావేశమయ్యారు. భారత్– మారిషస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా వి ద్య, ఇంధనం, హైడ్రోగ్రఫీ, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా రెండు దేశాల మధ్య ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్, మారిషస్‌లు కేవలం భాగస్వామ్య పక్షాలు మా త్రమే కాదని.. అవి ఒకే కుటుంబమని నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు.
స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన, స్థిరమైన, సౌభాగ్యవంతమైన హిందూ మహాసముద్రం ఇరుదేశాలకు ఉమ్మడి ప్రాధాన్యం కలిగిన అంశమని వివరించారు. నవీన్‌చంద్రతో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రతను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. మారిషస్‌లో యూపీఐ చెల్లింపులు, రూపేకార్డులు అందుబాటులోకి వచ్చాయని, ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం స్థానిక కరెన్సీల్లోనే జరి గేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
మారిషస్‌లో ‘మిషన్ కర్మయోగి’
ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద మారిషస్‌లో 10 ప్రాజెక్టులకు భారత్ సాయం అందించబోతోంది. ఇందులో ఓడరేవు, ఎయిర్‌పోర్టు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఇది ఆర్థిక సాయం కాదని.. రెండు దేశాల ఉమ్మడి భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్, మారిషస్‌లు రెండు వేర్వేరు దేశాలు అయినప్పటికీ వాటి స్వప్నాలు, భవిష్యత్తు ఒక్కటేనని స్పష్టంచేశారు.
చాగోస్ ఒప్పందం కుదిరినందుకు నవీన్ చంద్రతోపాటు మారిషస్ ప్రజలకు మోదీ అభినందనలు తెలిపారు. మారిషస్ సార్వభౌమత్వానికి ఇదొక చరిత్రాత్మక విజయమని ఉద్ఘాటించారు. మారిషస్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. మారిషస్ సార్వ¿ౌమత్వాన్ని పూర్తిస్థాయిలో గుర్తించడానికి తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని తెలిపారు. మారిషస్‌లో నూతన డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు.
మారిషస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి త్వరలో ‘మిషన్ కర్మయోగి’ప్రారంభిస్తామన్నారు. పరిశోధన, విద్య, నవీన ఆవిష్కరణల్లో భారత్, మారిషస్‌ల భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయమని స్పష్టంచేశారు. చాగోస్ దీవులను మారిషస్‌కు అప్పగించేందుకు ఈ ఏడాది మే నెలలో యునైటెడ్ కింగ్‌డమ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ దీవులపై హక్కులను యూకే వదులుకుంది. ఇదిలా ఉండగా, మారిషస్ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర ఈ నెల 16 దాకా భారత్‌లో పర్యటించనున్నారు.