జీఎస్‌టీ తరహాలో కస్టమ్స్
సుంకాల క్రమబదీ్ధకరణ ఉండొచ్చు
స్టాండర్డ్ డిడక్షన్ పెంపుపై ఉద్యోగుల ఆశలు
నిర్మలమ్మ బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌ను (2026–27 ఆర్థిక సంవత్సరం) వచ్చే నెల (ఫిబ్రవరి) 1న పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. గతేడాది జీఎస్‌టీలో శ్లాబులను క్రమబద్ధీకరించడం ద్వారా వినియోగానికి ఊతమిచి్చనట్టుగానే.. కస్టమ్స్ సుంకాల్లోనూ ఇదే మాదిరి సంస్కరణ ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అలాగే, అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగి, వాణిజ్య అనిశి్చతులు నెలకొన్న తరుణంలో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలను ప్రకటించొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. జీడీపీలో రుణ నిష్పత్తిని తగ్గించే మార్గ సూచీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ద్రవ్యలోటు నిర్వహణకు పరిమితం కాకుండా, రుణ భారాన్ని తగ్గించుకోవడంపై కేంద్ర సర్కారు ఇటీవలి కాలంలో దృష్టి సారించడం తెలిసిందే.
ముఖ్య అంచనాలు..
→ ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానుంది. పాత, కొత్త ఆదాయపన్ను విధానాల్లో స్టాండర్డ్ డిడక్షన్ అమల్లో ఉంది. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షలకు మించని ఆదాయంపై పన్ను మినహాయింపును గత బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు కొత్త పన్ను విధానంలోకి మరింత మందిని తీసుకొచ్చే విధంగా ప్రోత్సాహానికి స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచాలన్న డిమాండ్ ఉంది.
→ టీడీఎస్ శ్లాబులను తగ్గించొచ్చన్న అంచనా ఉంది. కస్టమ్స్ వివాదాల రూపంలో చిక్కుకుపోయిన రూ.1.53 లక్షల కోట్ల విడుదలకు వీలుగా క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించొచ్చు. అలాగే, నిబంధనల అమలును సులభతరం చేయాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది.
→ రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించొచ్చు.
→ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో రక్షణ రంగానికి ఈ విడత మరిన్ని కేటాయింపులు చేయొచ్చు.
→ వీబీజీ రామ్‌జీ పథకం కింద వ్యయాలను కేంద్రం, రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తిలో పంచుకోవచ్చు.
→ 2026 జనవరి 1 నుంచి 8వ పే కమిషన్ అమలుకు వీలుగా కేటాయింపులు చేయొచ్చు.
→ 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాలకు పన్నుల పంపిణీ.
→ టారిఫ్‌ల కారణంగా ప్రభావితమవుతున్న రత్నాభరణాలు, వస్త్రాలు, లెదర్ పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ప్రకటించొచ్చు.
→ లిథియం, కోబాల్ట్ తదితర అరుదైన ఖనిజాల అన్వేషణకు నిధుల మద్దతును ప్రకటించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.


