సామాన్యుడి జేబుకు ‘యుద్ధం’ చిల్లు | West Asia Conflict Drives FMCG Price Surge in India Amid US–Israel–Iran Tensions | Sakshi
Sakshi News home page

సామాన్యుడి జేబుకు ‘యుద్ధం’ చిల్లు

Mar 13 2026 12:04 PM | Updated on Mar 13 2026 12:17 PM

West Asia Conflict Drives FMCG Price Surge in India Amid US–Israel–Iran Tensions

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచంలోని వివిధ దేశాలతోపాటు భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. యునైటెడ్ స్టేట్స్-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం దౌత్యపరమైన అంశాలకే పరిమితం కాకుండా భారతీయులు రోజువారీ వాడే ఎఫ్ఎంసీజీ వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు కొరతతో ప్యాకేజింగ్ ఖర్చులు భారమవడంవల్ల కంపెనీలు ధరల పెంపు లేదా పరిమాణం తగ్గింపు దిశగా అడుగులు వేస్తున్నాయి.

పశ్చిమాసియా ప్రాంతం ప్యాకేజింగ్ పరిశ్రమకు కీలకంగా ఉంది. సబ్బులు, బిస్కెట్లు, డిటర్జెంట్ల ప్యాకింగ్‌కు వాడే పాలిమర్లు (పాలీప్రొపైలిన్, పాలిథిలిన్) నేరుగా ముడి చమురు నుంచే తయారవుతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా గొలుసు దెబ్బతింది.

ఇప్పటివరకు గల్ఫ్ దేశాల నుంచి 50% పాలిమర్లను దిగుమతి చేసుకున్న భారత కంపెనీలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా చైనా, థాయ్‌లాండ్, సింగపూర్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో ముడి చమురు ధరలు పెరగడంతో రవాణా, ముడిసరుకు సేకరణ ఖరీదైన వ్యవహారంగా మారింది.

ధర పెంపు లేదా క్వాంటిటీలో కోత?

వ్యాపార నిర్వహణ భారమవడంతో దిగ్గజ సంస్థలు తమ వ్యూహాలను మారుస్తున్నాయి. ప్రముఖ బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా దీనిపై స్పందిస్తూ.. తమ మొత్తం ఖర్చులో ప్యాకేజింగ్ వాటా 15-20 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. ‘చమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే చిన్న ప్యాకెట్లలో పరిమాణాన్ని తగ్గించడం, పెద్ద ప్యాకెట్ల ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేదు’ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, డిటర్జెంట్లు, క్లీనింగ్ ఉత్పత్తుల తయారీలో కీలకమైన లీనియర్ ఆల్కైల్ బెంజీన్ (ఎల్‌ఏబీ) ధరలు కూడా చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. డిటర్జెంట్ ముడి పదార్థాల ఖర్చులో దీని వాటా దాదాపు 50% ఉండటం గమనార్హం.

జీఎస్టీ లాభాలకు గండి

ఈ ధరల పెంపు నిర్ణయం సామాన్య వినియోగదారుడికి భారంగా మారనుంది. గత సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సవరణల వల్ల కంపెనీలు ప్యాకెట్ల పరిమాణాన్ని పెంచి, ధరలను తగ్గించాయి. తద్వారా లభించిన ఉపశమనాన్ని ప్రస్తుత యుద్ధ వాతావరణం పూర్తిగా తుడిచిపెట్టేసే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement