రూ.582 కోట్ల అనిల్‌ అంబానీ ఆస్తుల జప్తు | ED Tightens Grip on Anil Ambani Reliance ADAG Assets Attached Bank Fraud Probe | Sakshi
Sakshi News home page

రూ.582 కోట్ల అనిల్‌ అంబానీ ఆస్తుల జప్తు

Mar 13 2026 7:45 AM | Updated on Mar 13 2026 10:27 AM

ED Tightens Grip on Anil Ambani Reliance ADAG Assets Attached Bank Fraud Probe

రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఏడీఏజీ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భారీ బ్యాంక్ మోసాలు, నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి చర్యలు చేపట్టింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌)లకు చెందిన రూ.581.65 కోట్ల విలువైన 31 స్థిరాస్తులను ఏజెన్సీ తాజాగా జప్తు చేసింది. తాజా చర్యతో ఈ గ్రూపునకు సంబంధించి ఇప్పటివరకు అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.16,310 కోట్లకు చేరింది.

దేశవ్యాప్తంగా విస్తరించిన ఆస్తులు

తాజాగా జప్తు చేసిన 31 ఆస్తులు కేవలం ఒకట్రెండు ప్రాంతాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ భూములున్నాయి. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు ఉత్తరాదిలో ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయి. రిలయన్స్ పవర్ లిమిటెడ్‌పై నమోదైన ఫెమా కేసు దర్యాప్తులో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.

దర్యాప్తులో అంశాలు

  • యస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రముఖ బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 2025 జులై 22న ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. ఈ విచారణలో వెలుగుచూసిన ప్రధానాంశాలు కింది విధంగా ఉన్నాయి.

  • ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆర్‌సీఎఫ్‌ఎల్‌ సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన ప్రజా నిధుల్లో దాదాపు రూ.11,000 కోట్లకు పైగా నిధులు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మారాయి.

  • ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు లేని, ఆర్థిక బలం లేని డమ్మీ/షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.

  • సేకరించిన నిధులను గ్రూపులోని ఇతర సంస్థలైన రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్ వంటి కంపెనీలకు అక్రమంగా బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయి.

  • గ్రూప్ ప్రమోటర్లు, కీలక వ్యక్తులు దురుద్దేశపూర్వకంగానే ప్రజా నిధులను తమ సొంత ప్రయోజనాల కోసం మళ్లించినట్లు దర్యాప్తులో స్పష్టమైందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.

నగదు, డిపాజిట్లపై వేటు

కేవలం స్థిరాస్తులే కాకుండా నగదు రూపంలో ఉన్న ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. పీఎంఎల్ఏ, ఫెమా కింద జరిపిన దాడుల్లో రూ.2.48 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ సీజ్ చేశారు. ఫెమా సెక్షన్ 37ఏ కింద రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన 13 బ్యాంకు ఖాతాల్లోని రూ.77.86 కోట్ల బ్యాలెన్స్‌ను ఈడీ అటాచ్ చేసింది. గతంలోనే ఆర్‌కామ్ సహా ఇతర సంస్థలకు చెందిన రూ.15,729 కోట్ల ఆస్తులను ఏజెన్సీ జప్తు చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ట్రంప్‌ కోరిక నెరవేరుతుందా?

Advertisement
 
Advertisement
Advertisement