అనిల్‌ అంబానీకి ఈడీ షాక్ | ED Raids Reliance Power Sites Amid Allegations on Anil Ambani | Sakshi
Sakshi News home page

అనిల్‌ అంబానీకి ఈడీ షాక్

Mar 6 2026 12:01 PM | Updated on Mar 6 2026 12:06 PM

ED Raids Reliance Power Sites Amid Allegations on Anil Ambani

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. నిధుల మళ్లింపు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది.

పదికి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

ముంబైలోని రిలయన్స్ పవర్ కార్యాలయాలు, ఆ సంస్థతో సంబంధం ఉన్న కీలక వ్యక్తుల నివాసాలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది. దాదాపు 15 ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. నగరంలోని 10 నుంచి 12 ప్రదేశాల్లో తెల్లవారుజాము నుంచే అధికారులు తనిఖీలు చేపట్టారు. రిలయన్స్‌ పవర్‌ సంస్థకు సంబంధించి జరిగిన కొన్ని అనుమానాస్పద నిధుల బదిలీపై దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రాథమిక సమాచారం. అయితే, ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను ఈడీ వెల్లడించాల్సి ఉంది.

పాత కేసుల సెగ

అనిల్ అంబానీకి చెందిన కంపెనీలపై దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. గత కొంతకాలంగా వరుస పరిణామాలు రిలయన్స్ గ్రూప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో భాగంగా ముంబైలోని అత్యంత విలాసవంతమైన పాలి హిల్ ప్రాంతంలో ఉన్న రూ.3,716.83 కోట్ల విలువైన ‘అబోడ్’ నివాస ఆస్తిని ఈడీ ఇప్పటికే తాత్కాలికంగా జప్తు చేసింది. పీఎంఎల్ఏ 2002 నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు.

గత నెలలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సైతం అనిల్ అంబానీ నివాసంలో సోదాలు నిర్వహించింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ద్వారా రూ.2,220 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నది ప్రధాన ఆరోపణ. కల్పిత లావాదేవీల ద్వారా రుణాలను మళ్లించడం, ఖాతాలను తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్న ఎగుమతిదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement