ఏఐపై అత్యంత భారీ పెట్టుబడులు | India AI Impact 2026 Reliance, Adani, Google, Tata Lead 240 Billion USD Investment | Sakshi
Sakshi News home page

ఏఐపై అత్యంత భారీ పెట్టుబడులు

Mar 3 2026 8:39 AM | Updated on Mar 3 2026 8:54 AM

India AI Impact 2026 Reliance, Adani, Google, Tata Lead 240 Billion USD Investment

240 బిలియన్‌ డాలర్లకు కట్టుబాటు

ఏఐ సదస్సులో దిగ్గజాల వెల్లడి 

జాబితాలో ఆర్‌ఐఎల్, అదానీ, గూగుల్, టాటా

ప్రభుత్వ గణాంకాల విడుదల 

ఇటీవల నిర్వహించిన 2026 ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో భారీ పెట్టుబడులకు తెరలేచినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఏఐపై కార్పొరేట్‌ దిగ్గజాలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌సహా అదానీ గ్రూప్, గూగుల్, టాటా, లైట్‌స్పీడ్‌ వెంచర్స్‌ తదితరాలు ఉమ్మడిగా 240 బిలియన్‌ డాలర్లు(రూ. 21.84 లక్షల కోట్లు) ఇన్వెస్ట్‌ చేసేందుకు కట్టుబాటును ప్రదర్శించాయి. గత నెల 16–21 మధ్య నిర్వహించిన ఏఐ సదస్సు సుమారు 6 లక్షల మంది హాజరైన అతిపెద్ద ఈవెంట్‌గా నిలుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 100 దేశాల నుంచి ప్రతినిధులు, 20 అంతర్జాతీయ సంస్థలు వీటిలో పాలుపంచుకున్నట్లు వెల్లడించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫౌండేషన్‌ మోడళ్లు, హార్డ్‌వేర్, అప్లికేషన్లు తదితర విభాగాలలో 200 బిలియన్‌ డాలర్లకుపైగా ఏఐ సంబంధిత పెట్టుబడులకు కట్టుబాటు కనిపించినట్లు తెలియజేసింది.  

దిగ్గజాలు ఇలా..

ఏఐ సదస్సులో డైవర్సిఫైడ్‌ దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏఐ ఆధారిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై 110 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రణాళికలు ప్రకటించింది. ఏడేళ్లలో వీటిని వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2035కల్లా 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించింది. జనరల్‌ కేటలిస్ట్‌ ఐదేళ్లలో 5 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు కమిట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ బాటలో లైట్‌స్పీడ్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమని తెలియజేసింది.

గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కొత్తగా ఇండియా– యూఎస్‌ సబ్‌సీ కేబుల్‌ మార్గంసహా.. 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించారు. వీటిలో విశాఖపట్టణంలోని ఏఐ హబ్‌ సైతం కలసి ఉంది. ఇక టాటా గ్రూప్‌ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యాన్ని ప్రకటించడం గమనార్హం! ఈ సదస్సులో దేశ సావరిన్‌ కంప్యూట్‌ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు కీలక ప్రకటన వెలువడింది. ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన 38,000 జీపీయూలకు జతగా కొద్ది వారాలలో మరో 20,000 జీపీయూలకు తెరతీయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో నేషనల్‌ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మరింత పటిష్టంకానుంది. 850 ఎగ్జిబిటర్లతో 10 థిమాటిక్‌ పెవిలియన్లతో ఏర్పాటైన ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఏఐ ఎగ్జిబిషన్‌లలో ఒకటిగా నిలిచినట్లు ప్రస్తావించింది.

ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు

Advertisement
 
Advertisement
Advertisement