ఏబీసీడబ్ల్యూ పై ఏసీబీ దాడులు | ACB Raids in Srikakulam: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏబీసీడబ్ల్యూ పై ఏసీబీ దాడులు

Mar 3 2026 4:59 AM | Updated on Mar 3 2026 4:59 AM

ACB Raids in Srikakulam: Andhra Pradesh

పట్టుబడిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు, భూపత్రాలు

సుమారు రూ.1.10 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు 

భూ పత్రాలు, నగదు, బంగారం, వెండి స్వాదీనం

శ్రీకాకుళం క్రైమ్‌: వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారిగా (ఏబీసీడబ్ల్యూవో) శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గడ్డి బాలముకుందరావు అవినీతిపై ఏసీబీ అధికారులు సోమవారం మరోమారు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కారణంతోనే జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కాలనీలో ఉన్న ఆయన నివాస గృహంతో పాటు చాపురం–3, ఇలిసిపురం–చినబజారు వద్దనున్న బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఈ దాడులను జిల్లా ఏసీబీ డీఎస్పీ కెంబూరి సత్యనారాయణ తమ సిబ్బందితో ఉ.10 నుంచి రాత్రి 7.30 వరకు జరిపారు. సోదాల్లో సుమారు రూ.1.10 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి సంబంధిత పత్రాలను, విలువైన వస్తువులు, నగదును స్వా«దీనం చేసుకున్నారు. వివరాలివీ..  

ముందుగా కంచిలిలో పట్టుబడి..  
నరసన్నపేట ఏబీసీడబ్ల్యూగా ఉన్న బాలముకుందరావు సోంపేట ఏబీసీడబ్ల్యూ పాయింట్‌లో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. బాలముకుందరావు తన పరిధిలోని వసతిగృహ అధికారుల (వార్డెన్లు) నుంచి మెస్‌ బిల్లులు మంజూరు చేయించేందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 చొప్పున తీసుకుంటున్నట్లు సమాచారం రావడంతో గత నెల 28న కంచిలి బీసీ వసతిగృహంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు.

అందులో బాలముకుందరావుతో పాటు కార్యాలయ సహాయకుడు గుడ్ల రామకృష్ణల వద్ద లెక్కచూపని రూ.­1,84,070 నగదును స్వా«దీనం చేసుకుని క్రిమినల్‌ కేసు నమోదుచేశారు. అయితే, అదే రోజు అన్‌ అకౌంట్‌బుల్, అనధికారికంగా మరికొంత సొమ్ము (రూ.1.50 లక్షలు) బాలముకుందరావు వద్ద ఉండటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో ఆర్‌సీఓ (రిజిస్టర్డ్‌ కేస్‌ అదర్స్‌) కింద మారుస్తూ డీజీపీ అనుమ­తినివ్వడం, ఎస్సెట్స్‌ (ఆదాయానికి మించి ఆస్తులు)పై దృష్టి­పెట్టాలని చెప్పడంతో సోమవారం ఈ దాడులు జరిపారు.  

సోదాల్లో గుర్తించినవి..  
∙రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయా­­ల పరిధిలో నాలుగు  స్థిరాస్తులు (శ్రీకాకుళం పట్టణంలో భవ­నం సహా). ∙సుమారు 322 గ్రాముల బంగారు ఆభ­ర­ణా­లు, 1.75 కిలోల వెండి, నగదు, ఒక మారుతీ సెలెరి­యా కారు, రెండు ద్విచక్రవాహనాలు, విలువైన గృహోపకరణాలు. 

డీబీసీడబ్ల్యూపైనా ఆరోపణలు..?  
మరోవైపు.. ఈ మొత్తం ఎపిసోడ్‌పై జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిపైనా ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఏసీబీ అధికారులు మౌనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఏడాది మేలో ఉద్యోగ విరమణ చేయనున్న ఏబీసీడబ్ల్యూవో బాలగోవిందరావు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు సెలవు కోరుతూ జిల్లా అధికారికి దరఖాస్తు పెట్టుకున్నారు. పింఛన్‌కు సంబంధించి ప్రతిపాదనలను పూర్తిగాచేసి ఇవ్వాలంటే సోంపేట డివిజన్‌లోని మెస్‌ బిల్లులు మంజూరు చేసినందుకు బాలముకుందరావు మామూళ్లు వసూలుచేయాలంటూ ఆమె ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి.. జిల్లా వసతి గృహాలన్నింటిలో విద్యార్థుల మెస్‌ బిల్లులు మంజూరు చేసేందుకు డీబీసీడబ్ల్యూకి రూ.15లు, ఏబీసీడబ్ల్యూవోకి రూ.20లు, కార్యాలయ ఖర్చులకు వసతిగృహం నుంచి రూ.1,000లు ఇవ్వాలన్నది బహిరంగ రహస్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement