జీఎస్‌టీ తగ్గింపుతో పెరగనున్న వినియోగం
సీఈఏ అనంత నాగేశ్వరన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. జీఎస్‌టీ రేట్ల కోత, ఆదాయపన్ను మినహాయింపులతో పెరిగే వినియోగం వృద్ధికి ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం 6.8 శాతం వృద్ధి రేటు విషయంలో సౌకర్యంగా ఉన్నాను.
వాస్తవానికి 2025–26 సంవత్సరానికి సంబంధించి నా అంచనా 6.3–6.8 శాతం (ఆర్థిక సర్వే ప్రకారం). కనీసం 6–7 శాతం శ్రేణిలో కనిష్ట స్థాయికి వెళతామేమోనన్న ఆందోళన ఆగస్ట్‌లో వ్యక్తమైంది. ఇప్పుడు ఇది 6.5 శాతం, అంతకుమించి 6.8 శాతానికి కూడా చేరుకోవచ్చని సౌకర్యంగా చెబుతున్నాను. 7 శాతం వృద్ధి రేటు అంచనాలను వ్యక్తీకరించాలంటే, రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు వచ్చే వరకు ఆగాల్సిందే’’అని నాగేశ్వరన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
2025–26 జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం తెలిసిందే. దీనికంటే ముందు 2024 జనవరి–మార్చి త్రైమాసికంలో 8.4 శాతం స్థాయిలో జీడీపీ వృద్ధి నమోదైంది. ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉండగా, 5.2 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది.
అమెరికాతో ఒప్పందం సానుకూలం
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే దేశ వృద్ధి రేటు మరింత వేగాన్ని అందుకుంటుందని నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ ఒప్పందం సాకారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పందం విషయంలో పరిష్కారం పట్ల ఇప్పటికీ సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు అమలు చేస్తుండడం తెలిసిందే. నవంబర్ నాటికి తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతుండడం గమనార్హం.


