ఈ నెలాఖరుతో 2025–26లో 9 నెలలు పూర్తవుతాయి. వచ్చే మార్చికి ఏడాది పూర్తి. ఎలాగైతే ఏడాది పొడవునా ఆదాయం వస్తుందో, అదే రకంగా ఆదాయపు పన్ను చెల్లించాలి.
మొదటిది. టీడీఎస్..
ఉద్యోగస్తులైతే మొదటి నెల నుంచి టీడీఎస్ పరిధిలోకి వస్తారు. యజమాని ఉద్యోగి పన్ను భారాన్ని లెక్కించి, పన్నెండు భాగాలుగా విభజించి, ఏప్రిల్ నుంచి రికవరీ చేసి, గవర్నమెంటు ఖాతాలో జమ చేయాలి. ఇలా జరిగిన టీడీఎస్ మీ ఖాతాలోనే పడుతుంది. అంతే కాకుండా బ్యాంకు వాళ్లు మీకు వడ్డీ ఇచ్చినప్పుడు లేదా క్రెడిట్ చేసినప్పుడు టీడీఎస్ చేస్తారు. ఇతరత్రా ఎన్నో ఆదాయాలు చేతికొచ్చే సందర్భంలో టీడీఎస్ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి. అలాగే మీరు విదేశాలకు డబ్బులు పంపించినప్పుడు, బ్యాంకర్లు చేసే టీడీఎస్‌ని టీసీఎస్ అంటారు.
రెండోది. టీసీఎస్..
ఇది కూడా ముఖ్యమైన రికవరీ. కొన్ని నిర్దేశిత వస్తువులను మీరు కొంటున్నప్పుడు, అంటే, ఉదాహరణకి మోటర్ వాహనాన్ని తీసుకుంటే మీరు కొనుగోలుదారు అవుతారు. అప్పుడు అమ్మే వ్యక్తి మీ దగ్గర్నుంచి 1 శాతాన్ని పన్నుగా రికవరీ చేస్తారు. దీన్నే టీసీఎస్ అంటారు.
మూడోది.. ఎస్‌టీటీ..
ఇది షేర్ల క్రయవిక్రయాల్లో వసూలు చేసే పన్ను.
అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు..
పన్నుభారం కొన్ని పరిమితులు దాటితే, అడ్వాన్స్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. అలాంటి భారం ఏర్పడ్డ వారు ముందుగానే తమ అడ్వాన్స్ ట్యాక్స్ భారాన్ని లెక్కించి, నాలుగు భాగాలుగా సమర్పించాలి. 60 ఏళ్లు దాటిన వారికి వ్యాపారం/వృత్తి మీద ఆదాయం లేకపోతే వర్తించదు. ఎలా కట్టాలంటే.. జూన్ 15నాటికి 15 శాతం, సెప్టెంబర్ 15 నాటికి 30 శాతం, డిసెంబర్ 15 నాటికి 30 శాతం, మార్చి 15 నాటికి 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత జూన్ 15 నాటికి, ఆ తర్వాత ప్రతి క్వార్టర్‌లో చివరి నెల 15లోపు పైన చెప్పిన విధంగా చెల్లించాలి. కొంత మంది ఊహాజనితంగా ట్యాక్స్ చెల్లిస్తారు. వారు 100 శాతాన్ని మార్చి 15లోపల చెల్లించాలి. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ పడుతుంది.
క్యాపిటల్ గెయిన్స్ ఏర్పడటం ముందుగా ఊహించడం కుదరదు కనుక, అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కింపులో దాన్ని పరిగణనలోకి తీసుకోరు. కానీ వ్యవహారం అయిన తర్వాత వచ్చే క్వార్టర్‌లోగా చెల్లించాలి. అలా చెల్లించిన తర్వాత, టీడీఎస్ తీసుకున్నాక, ఇంకా పన్ను భారం ఏర్పడితే, మార్చి 31లోగా పూర్తిగా చెల్లించాలి. వీలైతే ఈ వారంలో మీరు వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఈ కింది వాటిని చూడండి.
1. ఫారం 26 ఏఎస్ 2. ఏఐఎస్ 3. టీఐఎస్
సర్వసాధారణంగా ఈ మూడు ఫారాలలోని అంశాల్లో, ఆ రోజు వరకు మీకొచ్చిన ఆదాయం, మీరు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, టీడీఎస్, టీసీఎస్ రికవరీ మొదలైనవి కనిపిస్తాయి. ఒక్కొక్కపుడు కొన్ని ఎంట్రీలు పడకపోవచ్చు, కనిపించకపోవచ్చు. గాభరాపడకండి. అవి అప్‌డేట్ అవుతాయి. ఈ సమాచారమంతా గ్రహించిన తర్వాత మీకు తెలుస్తుంది.. మీ పన్నుభారమెంతో. తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని మార్చి 15 వరకు వాయిదాలతో సర్ది, సరిచేసి అంతా చెల్లించి హాయిగా ఉండండి. దీనితో మీ పన్ను భారం చెల్లింపులు పూర్తవుతాయి.
ఆరోది..ఆఖరుది. సెల్ఫ్ అసెస్‌మెంటు. సాధారణంగా మార్చి లోపల చేసే చెల్లింపులన్నీ టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ అవుతాయి. మార్చి తర్వాత చేసే పేమెంట్లని, సెల్ఫ్ అసెస్‌మెంట్ చెల్లింపులని అంటారు. రిటర్నులు వేసేటప్పుడు అన్నీ దగ్గర పెట్టుకుని, పన్ను భారం లెక్కించి కట్టేది సెల్ఫ్ అసెస్‌మెంట్. అప్పటికే ఎక్కువ చెల్లించినట్లయితే రిఫండ్ కోరవచ్చు. అసెస్‌మెంట్ చేసినప్పుడు ఆదాయంలో హెచ్చులు, తప్పొప్పులు జరిగితే పన్నుభారం పడొచ్చు. ఆ చెల్లింపుని డిమాండ్ చెల్లింపని అంటారు. దీనితో కథ ముగిసినట్లే.


