సాధారణంగా చాలామంది గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు.. విక్రయదారులు బంగారాన్ని పింక్ కలర్ పేపర్‌లో చుట్టి ఇస్తుంటారు. బహుశా కొందరికి అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు.. ఎందుకు ఈ రంగు కాగితంలోనే చుట్టి ఇస్తున్నారని. మీ సందేహానికి సమాధానమే ఈ కథనం..
బంగారాన్ని సాధారణంగా పింక్ కలర్ పేపర్‌లోనే చుట్టి ఇవ్వడం వెనుక స్పష్టమైన శాస్త్రీయ కారణం కన్నా.. సంప్రదాయం, మానసిక ప్రభావం, వ్యాపారానికి సంబంధించిన ఆచారం కలిసి ఉన్నాయనే చెప్పాలి. పసిడి మన భారతీయ సంస్కృతిలో అత్యంత విలువైన లోహం. అది కేవలం ఆభరణంగా మాత్రమే అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఇది సంపదకు, శుభానికి, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. అంతటి విలువైన వస్తువును అందించే సమయంలో.. ఒక ప్రత్యేకత ఉండాలనే భావనతో వ్యాపారులు పింక్ కలర్ పేపర్‌లో చుట్టి ఇస్తూ వస్తున్నారు.
రంగు
ఇతర రంగుల కంటే.. పింక్ కలర్ మృదుత్వం, శుభ్రత, సౌమ్యతను సూచిస్తుంది. చూడగానే హాయిని ఇచ్చే ఈ రంగు.. మనసులో సానుకూల భావనను కలిగిస్తుంది. బంగారం లాంటి మెరిసే లోహాన్ని పింక్ పేపర్ మీద పెట్టినప్పుడు అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొనుగోలుదారు కూడా నేను చాలా విలువైన లోహాన్ని కొనుగోలు చేశాననే సంతృప్తిని ఇస్తుంది.
సాంప్రదాయం
చాలాకాలం నుంచి ఆభరణాల దుకాణాల్లో పింక్ లేదా లైట్ రెడ్ కలర్ పేపర్ ఉపయోగించడం అలవాటుగా మారిపోయింది. ఒక ఆచారం మొదలైందంటే.. అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆలాగే బంగారం విషయంలో పేపర్ రంగు నేటికీ కొనసాగుతోంది. బంగారం అంటే పింక్ పేపర్ అన్న భావన మనకు తెలియకుండానే మనసులో స్థిరపడిపోయింది.
ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!
వ్యాపారం
ఇతర పేపర్‌లతో పిలిస్తే.. పింక్ కలర్ పేపర్ మురికి, మడతలు వంటి వాటిని అంత త్వరగా కనిపించనివ్వదు. అంతే కాకుండా ఇది పెద్దగా ఖరీదైంది కాదు కూడా. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒకే రంగు వాడటం వల్ల దాని గుర్తింపు ప్రత్యేకమవుతుంది. అందుకే దుకాణదారులు కూడా గోల్డ్ అంటే.. పింక్ రంగునే వాడుతుంటారు.
మానసిక ప్రభావం
ప్రజలు ఎప్పుడైనా శుభం జరగాలనే కోరుకుంటారు. పింక్ పేపర్‌లో చుట్టి ఇవ్వడం వల్ల.. అది మరింత శుభంగా భావిస్తారు. పైన చెప్పుకున్నట్లు.. పింక్ రంగు మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది కూడా. ఇలా.. మొత్తం మీద గోల్డ్ అంటే పింక్ పేపర్ అని అందరూ పిక్స్ అయిపోయారు.


