భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ అంతర్జాతీయంగా అత్యంత విలువైన బ్రాండ్లుగా తమ ఆధిపత్యాన్ని కాపాడుకున్నాయి. బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదిక ‘ఐటీ సర్వీసెస్ 25 (2026)’ నివేదికలో టీసీఎస్ అంతర్జాతీయంగా రెండో స్థానంలో నిలవగా, ఇన్ఫోసిస్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్–25 విలువైన ఐటీ బ్రాండ్లు ఇందులో చోటుచేసుకున్నాయి.
అమెరికా, భారత్ చెరో ఎనిమిది ర్యాంకులతో ముందున్నాయి. యాక్సెంచర్ 42.3 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సంస్థగా మొదటి స్థానంలో నిలిచింది. యాక్సెంచర్ మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా ఎనిమిదో ఏడాది. టీసీఎస్ వరుసగా ఐదో ఏడాది ఈ జాబితాలో రెండో స్థానాన్ని కాపాడుకుంది. టీసీఎస్ విలువను 21.2 బిలియన్ డాలర్లుగా బ్రాండ్ ఫైనాన్స్ అంచనా వేసింది.
ఇక 16.4 బిలియన్ డాలర్లతో మూడో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఇన్ఫోసిస్ నిలిచింది. గత ఆరేళ్లుగా మూడో స్థానంలో ఉంటూ వస్తున్న ఇన్ఫోసిస్ విలువ ఏటా 15 శాతం చొప్పున పెరగడం గమనార్హం. హెచ్‌సీఎల్ టెక్, విప్రో టాప్–10లో చోటు దక్కించుకోగా.. టెక్ మహీంద్రా 12వ స్థానంలో ఉంది. అలాగే, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెక్సావేర్ టెక్నాలజీస్ సైతం ఈ జాబితాలో భారత్ నుంచి విలువైన బ్రాండ్లుగా నిలిచాయి.


