మూడోసారికి చైర్మన్‌గా కుదరని ఏకాభిప్రాయం
ఎటూ తేల్చని టాటా సన్స్ బోర్డ్
దేశీ కార్పొరేట్ దిగ్గజ గ్రూప్ టాటా సన్స్ బోర్డ్ తాజాగా నిర్వహించిన సమావేశంలో 62 ఏళ్ల నజరాజన్ చంద్రశేఖరన్ ఎంపికపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. గ్రూప్ చైర్మన్‌గా మూడోసారి పదవీ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు హోల్డింగ్ కంపెనీలో విభేదాలు కారణమని తెలుస్తోంది. 2027 ఫిబ్రవరితో చంద్రశేఖరన్ పదవీ కాలం ముగియనుంది.
టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నోయెల్ టాటా గ్రూప్‌లోని కొన్ని కంపెనీలకు వాటిల్లుతున్న నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా టాటా సన్స్ లిస్టింగ్‌పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నాయి. వెరసి చంద్రశేఖరన్ బాధ్యతల పొడిగింపుపై నిర్ణయం వాయిదాపడినట్లు తెలియజేశాయి.
టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది. అయితే సమావేశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలూ వెలువడకపోవడం గమనార్హం! కాగా.. గ్రూప్‌లోని ఒక కంపెనీ నష్టాలు నమోదు చేస్తున్నంతమాత్రాన మొత్తం గ్రూప్‌తోపాటు.. కొన్నేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైర్మన్ పనితీరును తప్పుపట్టడం సరికాదని బోర్డు సభ్యులు పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కొంతమంది డైరెక్టర్లు ఈ అంశంపై ఓటింగ్‌కు ప్రతిపాదించినప్పటికీ చంద్రశేఖరన్ వాయిదాకు ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
2017 నుంచి..
1987లో టాటా గ్రూప్‌లో చేరిన చంద్రశేఖరన్ తదుపరి కాలంలో ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆపై 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. విభిన్న బిజినెస్‌లుగల కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ పునర్వ్యవస్థీకరణ, కన్సాలిడేషన్ సమయంలో మార్గదర్శకత్వం వహించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో గ్రూప్‌లోని 15 భారీ లిస్టెడ్ కంపెనీల ఆదాయం, నికర లాభాలు రెట్టింపయ్యాయి.
ఇదీ చదవండి: మార్కెట్ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?


