మార్కెట్‌ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి? | Dalal Street Tumbles Global Shifts US Court AI Disruption nifty sensex | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Feb 25 2026 8:08 AM | Updated on Feb 25 2026 9:46 AM

Dalal Street Tumbles Global Shifts US Court AI Disruption nifty sensex

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పులు, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో వస్తున్న పెనుమార్పులు దలాల్ స్ట్రీట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గడిచిన ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ సుమారు 1,068 పాయింట్లు కుప్పకూలి 82,225 వద్ద ముగియగా, నిఫ్టీ 25,400 స్థాయికి దిగువన సరిపెట్టుకుంది. నేటి మార్కెట్ గమనాన్ని శాసించే కొన్ని అంశాలను పరిశీలిద్దాం.

ట్రంప్ టారిఫ్‌లు - యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠినమైన దిగుమతి సుంకాలపై అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) కింద అధ్యక్షుడు నేరుగా టారిఫ్‌లు విధించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇది తాత్కాలికంగా ఊరటనిచ్చినా ట్రంప్ వెంటనే మరో చట్టం (సెక్షన్‌ 122) కింద 15% అంతర్జాతీయ టారిఫ్‌లను ప్రకటించడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది.

భారత్‌పై ప్రభావం: ఐటీ, ఫార్మా వంటి ఎగుమతి ఆధారిత రంగాలు ఈ అనిశ్చితి కారణంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు ఈ వెయిట్ అండ్ వాచ్ ధోరణి కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆంత్రోపిక్ ప్రకంపనలు

టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌(సాస్‌)లు కొనసాగుతున్నాయి. ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసిన క్లాడ్ కోవర్క్, కోబాల్‌ వంటి ఏజెంటిక్ ఏఐ సర్వీసులు ఐటీ కంపెనీల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటా అనాలిసిస్ వంటి పనులను ఈ ఏఐ సర్వీసులు ఆటోమేట్‌ చేయడంతో మానవ ఆధారిత వ్యాపారం చేసే భారతీయ ఐటీ కంపెనీల మార్జిన్లు తగ్గుతాయని మార్కెట్ భయపడుతోంది.

అంతర్జాతీయ అనిశ్చితులు

మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరల హెచ్చుతగ్గులు, ఎఫ్‌ఐఐల నిరంతర అమ్మకాలు మార్కెట్‌ను బేరిష్ జోన్‌లోకి నెట్టాయి. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ కూడా బలహీనమైన సంకేతాలనే ఇస్తోంది.

పెట్టుబడిదారులకు సూచనలు

నగదు ఉండాల్సిందే: మార్కెట్ కనిష్ట స్థాయిలను తాకినప్పుడు కొనుగోలు చేయడానికి కొంత నగదును సిద్ధంగా ఉంచుకోండి.

ఐటీ రంగంపై జాగ్రత్త: ఐటీ కంపెనీలు ఏఐని ఎంత త్వరగా తమ వ్యాపారంలోకి స్వీకరిస్తున్నాయో గమనించండి. కేవలం తక్కువ ధరకు దొరుకుతున్నాయని ఐటీ స్టాక్స్‌ను భారీగా కొనకండి.

సిప్‌: దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులను పట్టించుకోకుండా క్రమానుగతంగా పెట్టుబడులు కొనసాగించడం మేలు.

గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

Advertisement
 
Advertisement
Advertisement