ఐటీలో పెను మార్పులు | Key Highlights from Jefferies Report IT sector | Sakshi
Sakshi News home page

ఐటీలో పెను మార్పులు

Feb 25 2026 8:43 AM | Updated on Feb 25 2026 9:54 AM

Key Highlights from Jefferies Report IT sector

బిజినెస్‌ మిక్స్‌పై ఏఐ తీవ్ర ప్రభావం

జెఫరీస్‌ తాజా నివేదికలో అంచనాలు 

ప్రస్తుతం ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ).. సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల్లో పెను మార్పులకు తెరతీస్తున్నట్లు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ తాజా నివేదిక పేర్కొంది. వెరసి ఐటీ రంగం వ్యవస్థాగతంగా తీవ్ర మార్పులకు లోనుకానున్నట్లు అభిప్రాయపడింది. ఐటీ రంగానికి కీలకమైన బిజినెస్‌ మిక్స్‌ను ఏఐ పునర్‌నిర్వచించనున్నట్లు తెలిపింది. తద్వారా కాలానుగుణ మార్పులు (సైక్లికాలిటీ) పెరగడంతోపాటు.. నిర్వహణా పద్ధతులు, నైపుణ్యాలు పునసమీక్షించుకోవలసి ఉన్నట్లు వివరించింది. ఏఐ సవాళ్లు ముగియలేదని, కన్సల్టింగ్, ఇంప్లిమెంటేషన్‌ పెరుగుతున్నప్పటికీ ఏఐ ఆధారిత మార్పులు సంప్రదాయ మేనేజ్‌డ్‌ సర్వీసులకు చెక్‌ పెట్టే అవకాశమున్నదని పేర్కొంది.  

డౌన్‌గ్రేడ్‌ బాటలో..

ఇప్పటికే ఐటీ దిగ్గజ కౌంటర్లు గరిష్టాల నుంచి 20–25 శాతం మధ్య పతనమైనప్పటికీ మరింత క్షీణతకు వీలున్నట్లు నివేదికలో  జెఫరీస్‌ అంచనా వేసింది. ఈ బాటలో ఐటీ పరిశ్రమ లీడర్స్‌ టీసీఎస్, ఇన్ఫోసిస్‌ షేర్లను సైతం డౌన్‌గ్రేడ్‌ చేసింది. తద్వారా షేర్ల ధరల టార్గెట్‌ను 33 శాతంమేర కుదించింది. ఇటీవల ఆంత్రోపిక్‌ క్లాడ్‌ తదితరాలు అసిస్టెంట్ల స్థాయి నుంచి క్లిష్టమైన టాస్క్‌లకు సైతం పూర్తి చేయగల టూల్స్‌ను రూపొందిస్తూ ఏఐ సవాళ్లు విసురుతున్న విషయం విదితమే. 

ఈ నేపథ్యంలో కొద్ది వారాలుగా సంప్రదాయ ఐటీ సర్వీసులు సహా.. సాఫ్ట్‌వేర్‌ విభాగ సేవలకు చెక్‌ పడే వీలున్నదని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నట్లు నివేదిక వివరించింది. ఆదాయాల్లో 22–45% వరకూ ఆక్రమిస్తున్న అప్లికేషన్‌ మేనేజ్‌డ్‌ సర్వీసుల నుంచి ఐటీ కంపెనీలు అడ్వయిజరీ, ఇంప్లిమెంటేషన్‌వైపు వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టవలసి ఉంటుందని సూచించింది. కాగా.. ఈ ప్రభావంతో దేశీయంగా ఫిబ్రవరి తొలి 3 వారాల్లోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 20% పతనంకావడం గమనార్హం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement