టెక్ ఆదాయాలు @ 315 బిలియన్ డాలర్లు
ఒడిదుడుకులున్నా 2025–26లో 6.1 శాతం వృద్ధి
1.35 లక్షల ఉద్యోగాల కల్పన నాస్కామ్ అంచనా
ముంబై: భౌగోళిక–రాజకీయ అంశాల కారణంగా ఒడిదుడుకులు నెలకొని, కృత్రిమ మేథతో (ఏఐ) పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశీ టెక్నాలజీ రంగం ఆదాయం 315 బిలియన్ డాలర్లకు చేరనుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి చెందనుంది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వార్షిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలో కొత్తగా 1.35 లక్షల ఉద్యోగాలు జత కావడం ద్వారా ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 58.15 లక్షల నుంచి పెరిగి 59.5 లక్షలకు చేరుతుందని పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరంలో 1.33 లక్షల కొత్త కొలువులు జత కాగా, ఈసారి 2,000 మాత్రమే పెరగడమనేది ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ స్థాయి వృద్ధిగా నమోదు కానుంది. ఆదాయం వృద్ధి చెందినంత స్థాయిలో కొలువులు పెరగకపోయినప్పటికీ, నికరంగా ఉద్యోగాలు పెరుగుతుండటమనేది సానుకూలాంశమని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. టెక్నాలజీలో పరిస్థితులు మారే కొద్దీ రాబోయే రోజుల్లోనూ ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేస్తుననట్లు వివరించారు. 59.5 లక్షల మంది ఉద్యోగుల్లో 20 లక్షల మంది ఏఐ శిక్షణ పొందగా, వీరిలో 3 లక్షల మంది అడ్వాన్స్‌డ్ ఏఐ నైపుణ్యాలను నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమకు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వాస్తవంగా చూస్తే కొత్త విభాగాల్లో టెక్నాలజీపై ఖర్చు చేయడం పెరుగుతుండటం సానుకూలమైన విషయమన్నారు.
నివేదిక ప్రకారం..
⇒ ప్రధాన ఐటీ సరీ్వసుల ఆదాయం 143 బిలియన్ డాలర్ల నుంచి 149 బిలియన్ డాలర్లకు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ రెవెన్యూ 55 బిలియన్ డాలర్ల నుంచి 59 బిలియన్ డాలర్లకు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఆదాయం 21 బిలియన్ డాలర్ల నుంచి 23 బిలియన్ డాలర్లకు పెరగనుంది.
⇒ ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్‌మెంట్ ఆదాయాలు 59 బిలియన్ డాలర్ల నుంచి 63 బిలియన్ డాలర్లకు, హార్డ్‌వేర్ కంపెనీల ఆదాయాలు 19 బిలియన్ డాలర్ల నుంచి 21 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి.
⇒ గతంలో అమెరికా, ఉత్తర అమెరికా మార్కెట్లలో ఆదాయ వృద్ధి అత్యధికంగా ఉండగా, ప్రస్తుతం ఆసియా–పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశీ మార్కెట్లో ఆదాయాలు అత్యధికంగా 7.9 శాతం మేర వృద్ధి చెందనుండటం ఆసక్తికరమైన అంశం.
⇒ విభాగాలవారీగా చూస్తే ఆరోగ్య సంరక్షణ, ట్రావెల్, రవాణా సెగ్మెంట్ల ఆదాయాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
⇒ చాలా మటుకు కంపెనీలు ఏఐ ఆదాయాలను వెల్లడించవు, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కృత్రిమ మేథపరమైన ఆదాయాలు 10–12 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా.


