న్యూఢిల్లీ: దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు (శనివారం) జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా ఎంపికైన దాదాపు 61 వేల మంది యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఈ రోజు మీ అందరి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈ నియామక పత్రం కేవలం ఉద్యోగంలో చేరడానికి అనుమతి మాత్రమే కాదు.. ఇది దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడానికి ఒక ఆహ్వానం. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) కలను సాకారం చేయడానికి, దేశ ప్రగతిని వేగవంతం చేయడానికి ఇది ఒక సంకల్ప పత్రం వంటిది’ అని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
#WATCH | PM Narendra Modi distributes appointment letters to more than 61000 youth
Source: DD pic.twitter.com/mjnWCBfXpM— ANI (@ANI) January 24, 2026
కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా రక్షణ రంగంలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు పంపిణీ చేసిన నియామక పత్రాల్లో 49,200 హోం మంత్రిత్వ శాఖ, పారామిలటరీ దళాలకు సంబంధించినవే కావడం విశేషం. మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. సరిహద్దుల్లోని జీరో లైన్ వద్ద బీఎస్‌ఎఫ్ మహిళా దళాలు పహారా కాస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే జనవరి 26న కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో సీఆర్‌పీఎఫ్ పురుషుల దళాలకు ఒక మహిళా అసిస్టెంట్ కమాండెంట్ నాయకత్వం వహించనున్నారు’ అని ప్రధాని మోదీ ప్రకటించారు.
భారత ప్రభుత్వం అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, దీనివల్ల భారతీయ యువతకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు. జనవరి 24వ తేదీకి ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఉందని మోదీ గుర్తుచేశారు. సరిగ్గా 76 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగ సభ ‘జనగణమన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా ఆమోదించింది. ఈ పవిత్రమైన రోజున నియామక పత్రాలు అందుకోవడం రాజ్యాంగం పట్ల బాధ్యతను మరింత పెంచుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


