పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన నిర్ణయాలే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశ రాజధానిలో పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ‘దర్పణ్ 2.0’ అనే అధునాతన పర్యవేక్షణ(మానిటరింగ్) డాష్‌బోర్డ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఈ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది.
ఏమిటీ ‘దర్పణ్ 2.0’?
దర్పణ్ (Dashboard for Analytics, Review and Performance Assessment Nationwide) అనేది వివిధ ప్రభుత్వ పథకాలను 24x7 పర్యవేక్షించేందుకు రూపొందించిన ఒక మల్టీ ల్యాంగ్వేజీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. ఇది కేవలం సమాచారాన్ని చూపడమే కాకుండా, విశ్లేషణాత్మక అంశాలను అందిస్తుంది.
ఫీచర్లు ఇవే..
వేర్వేరు విభాగాల మధ్య ఉన్న డేటా అంతరాలను తొలగించి అన్ని ప్రభుత్వ పథకాల పురోగతిని ఒకే చోట చూపిస్తుంది.
ప్రభుత్వ పథకాల స్టేటస్‌ను తెలియజేస్తుంది. ఈ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా? అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు. రియల్ టైమ్‌లో వీటిని ట్రాక్ చేయవచ్చు.
ఏదైనా ప్రాజెక్ట్ నెమ్మదించినా లేదా అడ్డంకులు ఎదురైనా ఈ సిస్టమ్ అధికారులను ముందుగానే అప్రమత్తం చేస్తుంది.
కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ) ద్వారా ప్రతి విభాగం పనితీరును స్కోర్ కార్డుల రూపంలో అంచనా వేస్తుంది.
అమలు ఎప్పుడంటే..
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం రాబోయే 12 నుంచి 16 వారాల్లో దశలవారీగా అమలు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల నోడల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. సురక్షితమైన ఏపీఐల ద్వారా ఢిల్లీ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ఈ డాష్‌బోర్డ్‌కు అనుసంధానిస్తారు.
భవిష్యత్ లక్ష్యాలు
డిజిటల్ ఇండియా విజన్‌లో భాగంగా రూపొందుతున్న ఈ వ్యవస్థ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విశ్లేషణలకు, పబ్లిక్ డాష్‌బోర్డ్‌లకు పునాది వేయనుంది. దీనివల్ల ప్రభుత్వ పనితీరు ప్రజలకు స్పష్టంగా తెలియడమే కాకుండా, సాక్ష్యాధారిత విధాన ప్రణాళిక రూపొందించడానికి మార్గం సుగమం అవుతుంది.
ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ ‘దర్పణ్’ మోడల్‌ను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్: ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘NexGen UP-CM DARPAN 2.0’ పేరుతో అత్యంత ఆధునిక వెర్షన్‌ను ప్రారంభించింది. ఇందులో 53 విభాగాలకు చెందిన దాదాపు 588 పథకాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్: ఈ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాల పురోగతిని పర్యవేక్షించడానికి దర్పణ్ డ్యాష్‌బోర్డ్ అందుబాటులో ఉంది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్: పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను సమర్థవంతంగా వాడుతున్నారు.
ఈశాన్య రాష్ట్రాలు: మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాలు కూడా తమ జిల్లా స్థాయి ప్రాజెక్టుల పర్యవేక్షణకు దీనినే ఉపయోగిస్తున్నాయి.
కేంద్రపాలిత ప్రాంతాలు: పుదుచ్చేరి, లక్షద్వీప్, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో కూడా ఇది అమలులో ఉంది.


