ఇటీవల కాలంలో బంగారం అంటేనే కొండెక్కి కూర్చునే ధర అనుకున్న వారికి, ఇప్పుడు వెండి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కేవలం ఏడాది కాలంలోనే సుమారు 120 శాతం పైగా రాబడి అందించి, కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2 లక్షలను దాటింది. అయితే, ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదు. 2026 జనవరి 1 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు అయిన చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించనుందనే వార్తలు గ్లోబల్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి.
సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోసం మైక్రోచిప్‌ల తయారీలో వెండి వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు కేవలం ఆభరణాలకే పరిమితమైన వెండి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారింది. సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 2026 ప్రారంభానికి ముందే కిలో వెండి ధర రూ.2.5 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు చైనా ఎగుమతుల కోత, ఇటు పెరుగుతున్న టెక్నాలజీ అవసరాల మధ్య వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లనున్నాయి.
వెండి ఎగుమతులపై చైనా ఆంక్షలు
ప్రపంచంలో వెండి ఉత్పత్తిలోనూ, ఎగుమతిలోనూ చైనాది కీలక పాత్ర. అయితే జనవరి 1, 2026 నుంచి చైనా ప్రభుత్వం వెండి ఎగుమతులపై కొత్త నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. అయితే వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రతిపాదిత అంశాల ప్రకారం.. ఇకపై వెండిని ఎగుమతి చేయాలంటే కంపెనీలు ప్రత్యేక ప్రభుత్వ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇది 2027 వరకు అమలులో ఉండే అవకాశం ఉంది. ఏడాదికి 80 టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే చిన్న సంస్థలకు ఎగుమతి అనుమతులు నిరాకరించే అవకాశం ఉంది. కేవలం పెద్ద, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలకే ఈ అవకాశం దక్కుతుంది. చైనా తన దేశీయ అవసరాల కోసం (ముఖ్యంగా సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాలు) వెండి నిల్వలను కాపాడుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలను ప్రభావితం చేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
డిమాండ్ పెరగడానికి కారణాలు
గ్రీన్ ఎనర్జీ విప్లవం.. వెండికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ. సౌర ఫలకాల తయారీలో వెండిని కీలకమైన సిల్వర్ పేస్ట్ రూపంలో వాడతారు. ప్రపంచం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతుండటంతో సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి డిమాండ్ 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు 150% పెరిగింది.
ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ.. సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం చాలా ఎక్కువ. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, సెన్సార్లు, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ల విస్తరణ వల్ల అత్యాధునిక చిప్‌లు, సెమీకండక్టర్ల తయారీలోనూ వెండి వాటా పెరుగుతోంది.
సరఫరాలో లోటు.. గడిచిన ఐదేళ్లుగా వెండి ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ద్వారా వచ్చే వెండి పరిమితంగా ఉంది. వెండి అనేది ఎక్కువగా రాగి, బంగారం, సీసం వంటి లోహాల వెలికితీతలో ఉప-ఉత్పత్తిగా ఉంది. కాబట్టి, డిమాండ్ పెరిగిన వెంటనే వెండి ఉత్పత్తిని పెంచడం మైనింగ్ సంస్థలకు సాధ్యం కావడం లేదు.
సురక్షిత పెట్టుబడిగా వెండి.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల వల్ల పెట్టుబడిదారులు వెండిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది వెండి దాదాపు 120% పైగా రాబడిని ఇచ్చింది.
2026 నాటి చైనా ఎగుమతి ఆంక్షలు అమలులోకి వస్తే గ్లోబల్ మార్కెట్లో వెండి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఆభరణాల రంగాన్నే కాకుండా ఆధునిక సాంకేతిక, ఇంధన రంగాలను కూడా ప్రభావితం చేస్తుంది. భారతీయ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, 2026 నాటికి వెండి ధరలు కిలోకు రూ.2.4 లక్షల నుంచి 2.5 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వెండి కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక వనరుగా మారబోతోంది.
ఇదీ చదవండి: రూపాయి విలువ తగ్గినా మంచికే!


