కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో చారిత్రాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. ఆదాయపు పన్ను బిల్లు, 2025 ద్వారా ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖకు పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఇతర డిజిటల్ ఖాతాలను యాక్సెస్ చేసే అధికారం లభించనుంది. పన్ను ఎగవేతను అరికట్టడానికి, ఆర్థిక పారదర్శకతను పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ విస్తరణ
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలు కేవలం బ్యాంకు ఖాతాలకు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఆన్‌లైన్ వేదికల ద్వారా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ అనే నిర్వచనాన్ని విస్తరించింది. దీని పరిధిలోకి..
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు (Facebook, Instagram, X మొదలైనవి)
వ్యక్తిగత కమ్యూనికేషన్.. ఈమెయిల్ రికార్డులు.
ఆన్‌లైన్ ఖాతాలు.. క్లౌడ్ స్టోరేజ్, ట్రేడింగ్ ఖాతాలు, ఇన్వెస్ట్‌మెంట్ పోర్టల్స్ వస్తాయి.
పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన ఆదాయానికి, వారి వాస్తవ జీవనశైలికి మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మార్పులు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయని గమనించాలి. కొందరు పన్ను చెల్లింపుదారులు తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ విదేశీ పర్యటనలు చేయడం లేదా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి ప్రతిపాదిత మార్పుల ద్వారా నిఘా పరిధిలోకి వస్తాయి.
ఈ డిజిటల్ పర్యవేక్షణ ద్వారా పన్ను చెల్లింపుదారులలో బాధ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో భారీ డేటాను విశ్లేషించి పన్ను ఎగవేతను ముందస్తుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.
గోప్యతా ఆందోళనలు.. చట్టపరమైన సవాళ్లు
ఈ సంస్కరణ అమలుపై న్యాయ నిపుణులు, పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా గోప్యత ప్రాథమిక హక్కు అనే అంశంపై చర్చ జరుగుతోంది. కోర్టు అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం అధికారులకు ఇవ్వడం దుర్వినియోగానికి దారితీయవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. క్లౌడ్ స్టోరేజ్ నుంచి వ్యక్తిగత సందేశాల వరకు యాక్సెస్ ఉండటం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో 30,000 మంది నియామకం


