భారతదేశ తయారీ రంగంలో నియామకాల పర్వం కొనసాగుతోంది. తైవాన్‌కు చెందిన దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన తన కొత్త ఐఫోన్ అసెంబ్లీ యూనిట్‌లో రికార్డు స్థాయిలో నియామకాలు చేపట్టింది. కేవలం 8 నుండి 9 నెలల వ్యవధిలోనే దాదాపు 30,000 మంది కార్మికులను నియమించుకోవడం ద్వారా తన కార్యకలాపాలను వేగవంతం చేసింది.
మహిళలకు పెద్దపీట
300 ఎకరాల ఈ భారీ సదుపాయంలో మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 80 శాతం మంది మహిళలే. వీరిలో మెజారిటీ ఉద్యోగులు 19-24 సంవత్సరాల వయస్సు కలిగిన వారు, మొదటిసారి ఉద్యోగంలో చేరుతున్న వారే కావడం గమనార్హం. వచ్చే ఏడాది నాటికి ఈ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటే మొత్తం ఉద్యోగుల సంఖ్య 50,000కు పెరుగుతుందని అంచనా. తద్వారా దేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలో లేని విధంగా ఒకే ప్రాంగణంలో అత్యధిక మంది మహిళా కార్మికులు పనిచేస్తున్న ప్లాంట్‌గా ఇది రికార్డు సృష్టించనుంది.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తయారీ ఇక్కడే..
ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఐఫోన్ 16 మోడల్‌తో ట్రయల్ రన్ ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం యాపిల్ అత్యాధునిక మోడల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను తయారు చేస్తోంది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తుల్లో 80 శాతానికి పైగా విదేశాలకు ఎగుమతి కానున్నాయి.
ప్లాంట్ విశేషాలు
సుమారు రూ.20,000 కోట్లు పెట్టుబడి.
2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం.
సగటున వేతనం నెలకు రూ.18,000 (ఉచిత వసతి, సబ్సిడీ భోజనం).
ఉద్యోగుల కోసం ఇప్పటికే 6 భారీ వసతి గృహాలు అందుబాటులోకి వచ్చాయి.
‘మినీ టౌన్‌షిప్’గా దేవనహళ్లి
కేవలం ఫ్యాక్టరీగానే కాకుండా ఈ ప్లాంట్ భవిష్యత్తులో ఒక మినీ టౌన్‌షిప్‌లా మారనుందని కంపెనీ చెప్పింది. ఇందులో నివాస సముదాయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, వినోద సౌకర్యాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మహిళా కార్మికులకు ఇది ఎంతో ఆసరాగా నిలుస్తోందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: చలి చంపుతున్నా వ్యాపారం భళా


