భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రేయర్ (Embraer SA) మధ్య కీలకమైన వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. తాజాగా జరిగిన ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో ప్రాంతీయ వాణిజ్య విమానాల (Regional Transport Aircraft) తయారీ, అసెంబ్లీ లైన్లను ఏర్పాటు చేయనున్నారు.
సాధారణంగా ఎయిర్‌బస్, బోయింగ్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ నుంచి విమాన విడిభాగాలను మాత్రమే సేకరిస్తుంటాయి. కానీ, పూర్తిస్థాయి అసెంబ్లీ లైన్లను ఏర్పాటు చేసేందుకు అవి ఇప్పటివరకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో అదానీ-ఎంబ్రేయర్ భాగస్వామ్యం భారత విమానయాన రంగంలో ఒక కొత్త విప్లవానికి తెరలేపనుంది.
ఒప్పందంలోని ప్రధానాంశాలు
ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లోనే ఎంబ్రేయర్ విమానాల అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. విమానాల విక్రయాలకు సంబంధించి తగినంత స్థాయిలో ఆర్డర్లు లభించిన వెంటనే అసెంబ్లీ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన బదిలీ (Technology Transfer), శిక్షణ, పటిష్టమైన సప్లై చైన్ వ్యవస్థ ఏర్పడుతుంది.
ప్రభుత్వ మద్దతు
భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘ఆత్మనిర్భర్ భారత్’, దేశంలోని చిన్న పట్టణాలను విమాన మార్గాలతో అనుసంధానించే ‘ఉడాన్’ (UDAN) పథకాలకు ఈ ఒప్పందం ఊతం ఇస్తుంది. దీనివల్ల భారత్-బ్రెజిల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెట్టుబడి వివరాలు, ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేస్తారు.. పనుల ప్రారంభ గడువు (Timeline) వంటి అంశాలు చర్చల దశలోనే ఉన్నాయి. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యం విజయవంతం అయితే భారత్ కేవలం విమానాల వినియోగదారు దేశంగానే కాకుండా ప్రపంచ స్థాయి విమానాల తయారీ కేంద్రంగా కూడా అవతరిస్తుంది.
ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు


