ఇంకొన్ని రోజుల్లో 2026 వచ్చేస్తోంది. కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయని మార్కెట్ పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. దీని ప్రకారం ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు అన్నీ 20% వరకు ఖరీదైనవి కావచ్చు.
మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు 2026లో తమ ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం సంస్థలు టారిఫ్‌లను 16 నుంచి 20 శాతం వరకు పెంచవచ్చు. ఇది రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రతి ఏటా టెలికాం కంపెనీలు ఇలా పెంచుకుంటూనే వెళ్తున్నాయి. జూలై 2024లో కూడా కంపెనీలు టారిఫ్‌లను పెంచినప్పుడు.. రీఛార్జ్ ప్లాన్‌లు మరింత ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు మరోమారు అదే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. యూజర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంది.
ఏ కంపెనీ ఎంత టారిఫ్‌లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్‌టెల్ 28 రోజుల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది.
జియో రూ.299 ప్లాన్‌ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.
వోడాఫోన్ ఐడియా 28 రోజుల 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.340 నుంచి రూ.419కి పెరగవచ్చు. అదేవిధంగా, 56 రోజులు (సుమారు 2 నెలలు) చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ రూ.579కి బదులుగా రూ.699కి పెరగవచ్చు.


