లగేజీ తక్కువుంటే ధర కూడా తక్కువే

Discount on airline ticket price if cabin luggage only - Sakshi

కేబిన్‌ లగేజీ మాత్రమే ఉంటే విమాన టిక్కెట్‌ ధరలో డిస్కౌంట్‌

న్యూఢిల్లీ :మీకు ఎక్కువగా లగేజీ లేదా ? చిన్న బ్యాగుతోనే విమానంలో ప్రయాణించాలనుకుం టున్నారా ? అయితే మీ టిక్కెట్‌ ధర మరింత చౌకగా లభించనుంది. కేవలం కేబిన్‌ లగేజీ మాత్రమే ఉన్నవారికి దేశీయ విమానాల్లోని టిక్కెట్‌ ధరల్లో డిస్కౌంట్‌ ఇవ్వడానికి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.  ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విమాన ప్రయాణికులు కేబిన్‌ లగేజీ కింద 7 కేజీలు, చెక్‌ ఇన్‌ లగేజీ కింద 15 కేజీలు తీసుకువెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ బరువున్న సామాన్లు తీసుకువెళితే అదనపు చార్జీలు ఉంటాయి.

అయితే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రయాణికులు టిక్కెట్‌ బుకింగ్‌ సమయంలోనే తాము ఎంత బరువైన లగేజీ తీసుకువెళతారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. అప్పుడే తక్కువ లగేజీ ఉన్నవారికి టిక్కెట్‌ డిస్కౌంట్‌ ధరకి వస్తుందని తెలిపింది.   ప్రత్యేకంగా ఒక సీటు కావాలన్నా, భోజనం, స్నాక్స్, డ్రింక్స్‌  అడిగినా, మ్యూజిక్‌ వినాలనుకున్నా విమానయాన సంస్థలు అదనపు చార్జీలను వసూలు చేస్తున్నాయి.  ఈ సర్వీసులు అవసరం లేని ప్రయాణికుల వాటిని ఎంచుకోకపోతే టిక్కెట్‌« ధర తగ్గుతుంది. అదే విధంగా లగేజీ లేకపోతే టిక్కెట్‌ ధర తక్కువకి వచ్చే సదుపాయాన్ని డీజీసీఏ ప్రయాణికులకు కల్పించింది. విమానయాన సంస్థలను నష్టాల నుంచి బయటపడేయడానికి కేంద్రం విమాన చార్జీలను 10–30శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. ప్రయాణికులకు కూడా ఊరట కల్పించడానికి   ఈ విధానాన్ని తీసుకువచ్చింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top