న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్ షాకిచ్చింది. రైల్వే ప్రయాణికులు ఇకపై ఉచిత పరిమితిని మించి తీసుకెళ్లే లగేజీపై అదనపు ఛార్జీలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో స్పష్టం చేశారు. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. విమానాల్లో అమలవుతున్న విధానంలాగే రైల్వేలో కూడా సామాను పరిమితి నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఏ కోచ్‌లో ఎంతమేర వరకు లేగేజీని తీసుకొని వెళ్లొచ్చు. ఎన్నికేజీల వరకు పరిమితి దాటితే అదనంగా డబ్బులు చెల్లించాలనే వివరాల్ని చదివి వినిపించారు.

క్లాస్ వారీగా ఉచిత పరిమితులు
సెకండ్ క్లాస్: 35 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 70 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు..35 కేజీల నుంచి పెరిగితే అదనపు ఛార్జీలు చెల్లించాలి.
స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 80 కిలోల వరకు అనుమతి, అదనపు ఛార్జీలు తప్పనిసరి.
ఏసీ 3-టైర్ / చైర్ కార్: 40 కిలోల వరకు ఉచితం.
ఫస్ట్ క్లాస్, AC 2-టైర్: 50 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 100 కిలోల వరకు అనుమతి.
ఏసీ ఫస్ట్ క్లాస్: 70 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 150 కిలోల వరకు అనుమతి, అదనపు ఛార్జీలు తప్పనిసరి’ అన్నారు. ‘ప్రయాణికులు నిర్దిష్ట పరిమితిని మించి సామాను తీసుకెళ్తే.. రైల్వే నియమాల ప్రకారం ఛార్జీలు తప్పనిసరిగా చెల్లించాలి. ఇది కొత్త నియమం కాదు. ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనే’ అని మంత్రి వైష్ణవ్ స్పష్టం చేశారు.

ఇది కొత్త నియమం కాదు.. కానీ
అవును, రైల్వే శాఖ గతంలో కూడా అదనపు సామానుపై ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇది కొత్త నియమం కాదు. కానీ ఇప్పటివరకు కఠినంగా అమలు చేయకపోవడం వల్ల చాలా ప్రయాణికులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు.చాలా కాలం పాటు ఈ నియమాలు కఠినంగా అమలు కాలేదు. స్టేషన్లలో సామాను తూకం వేసే వ్యవస్థలు లేకపోవడం, ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వసూళ్లు జరగలేదు.
రైల్వే శాఖ.. ఎయిర్‌లైన్ తరహాలో
తాజాగా.. రైల్వే శాఖ.. ఎయిర్‌లైన్ మాదిరి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాన స్టేషన్లలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు ఏర్పాటు చేసి, ఉచిత పరిమితిని మించిన సామానుపై తప్పనిసరిగా ఛార్జీలు వసూలు చేయనుంది. కాబట్టి, గతంలో కూడా నిబంధనలు ఉన్నప్పటికీ, అవి సడలింపుతో అమలయ్యాయి. ఇప్పుడు మాత్రం రైల్వే శాఖ కఠినంగా వసూలు చేయబోతోంది.
కాగా,ప్రతిరోజూ కోట్లాది మంది రైల్వేలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు రైల్వే సామాను పరిమితి నిబంధనలు అమలు చేస్తోంది. అయితే, చాలా మంది ప్రయాణికులు ఈ నియమాల గురించి తెలియకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి.


