న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాలుగవ రోజు (గురువారం) సభ సమావేశమైన వెంటనే, ప్రతిపక్షాలు ప్రధానంగా రెండు కీలక సమస్యలను లేవనెత్తాయి. అవి ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్య సంక్షోభం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడం. ప్రతిపక్షాల ఎజెండాలో వాయు కాలుష్యంపై చర్చ ప్రధానాంశంగా నిలవగా, పలువురు ప్రతిపక్ష ఎంపీలు గ్యాస్ మాస్క్‌లు ధరించి నిరసన తెలిపారు. ఈ సమస్యను జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఉత్తర భారతదేశంలోని నెల రోజుల నుంచి తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై చర్చ నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. మాణికం ఠాగూర్, మనీష్ తివారీ, విజయకుమార్ అలియాస్ విజయ్ వసంత్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్న ఈ సంక్షోభాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ తీర్మానం నోటీసులో ప్రభుత్వం సమన్వయంతో కూడిన జాతీయ వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమైందని, పక్షవాతానికి గురై, చర్యలకు బదులుగా సలహాలు మాత్రమే ఇస్తోందని" తీవ్రంగా విమర్శించారు.
వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ప్రతిపక్ష ఎంపీలు బుధవారం, గురువారం పార్లమెంట్‌కు గ్యాస్ మాస్క్‌లు ధరించి వచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా వాయు కాలుష్యం వంటి ముఖ్యమైన ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ కాలుష్య సంక్షోభంపై స్పందిస్తూ, ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడంలో కేంద్రంలోని బీజేపీ విఫలమయ్యిందని ఆరోపించారు. ఇదే సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అధికార పార్టీపై పదునైన విమర్శలు చేశారు. గురువారం ప్రారంభ వాణిజ్యంలో యూఎస్ డాలర్‌తో రూపాయి విలువ 28 పైసలు క్షీణించి, చరిత్రలో ఎన్నడూ లేనంతగా ₹90.43 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
"కొన్ని సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ హయాంలో రూపాయితో పోలిస్తే డాలర్ విలువ ఎక్కువగా ఉన్నప్పుడు, వీరంతా ఏమన్నారు? ఇప్పుటి పరిస్థితికి వీరు చెప్పే సమాధానం ఏమిటి? వారినే అడగండి, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు," అని ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్ వెలుపల విలేకరులను ప్రశ్నించారు. రూపాయి విలువ పతనంపై అధికార పక్షం గతంలో చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేస్తూ, ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ పతనం గురించి ప్రశ్నించడానికి ప్రయత్నించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాలుగవ రోజు (గురువారం) కేవలం చట్టసభ చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఆరోగ్య , ఆర్థిక సంక్షోభాలకు వేదికగా నిలిచింది. ప్రతిపక్షాల గ్యాస్ మాస్క్ నిరసన ఢిల్లీలోని కాలుష్య సంక్షోభ తీవ్రతను జాతీయ వేదికపైకి తీసుకువచ్చింది. రూపాయి పతనంపై ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తాయి. కాలుష్యాన్ని జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలనే డిమాండ్‌పై కేంద్రం స్పందన కోసం పలువురు ఎదురుచూస్తున్నారు.
#WATCH | Delhi: Opposition MPs protest in front of Makar Dwar on Parliament premises over air pollution issue. pic.twitter.com/BoEeQQPdkH
— ANI (@ANI) December 4, 2025


