కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 9 - 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో మున్నార్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిగా.. అవును మీరు చదవింది నిజమే.. సోనియా గాంధీ కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎవరీ సోనియా గాంధీ
కేరళలోని నల్లతన్ని కల్లార్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ విధేయుడు, సీనియర్ నాయకుడు దివంగత దురే రాజ్ కుమార్తె సోనియా గాంధీ. సోనియా గాంధీ పట్ల అభిమానంతో, ఆమెకు ఆ పేరు పెట్టుకున్నారట.
అయితే బీజేపీలో చురుకైన కార్యకర్తగా ఉన్న సుభాష్‌ను సోనియా వివాహం చేసుకున్నారు . ప్రస్తుతం పంచాయతీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతేకాదు పాత మున్నార్ మూలక్కడ వార్డులో జరిగిన ఉప ఎన్నికలో ఆమె బీజేపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. తన భర్త రాజకీయ మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడు మళ్లీ బీజేపీ తరపున బరిలోకి దిగారు. .
మరోవైపు మున్నార్‌లో సోనియా గాంధీ పోటీ కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్‌కు ఇక్కడ సంకట పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే కాంగ్రెస్ అధినేతగా సోనియా గాంధీ పేరు అందరికీ సుపరిచితమే. ఆ పేరున్న వ్యక్తం పోటీ చేయడంతో సోనియా పేరు తక్షణమే ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో రమేష్ ఆందోళన పడుతున్నారు. డిసెంబర్ 13న లెక్కింపు జరుగుతుంది.


