‘హక్కుల తీర్మానం’పై రేణుక స్పందన
న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలోకి కారులో కుక్కను తీసుకొచ్చి కలకలం రేపిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి బుధవారం మీడియాకు మరింత పని పెట్టారు. తనపై సభలో హక్కుల తీర్మానం పెట్టాలని పాలక బీజేపీ ఎంపీలు యోచిస్తున్నారన్న వార్తలపై మీడియా ఆమెను ప్రశ్నించగా ‘భౌ భౌ...!’అంటూ విచిత్రంగా స్పందించారు. ‘‘ఇంతకంటే ఇంకేం చెప్పమంటారు నన్ను?’’ అంటూ మీడియాకే ఎదురు ప్రశ్న కూడా వేశారు.
‘‘తీర్మానం పెట్టినప్పుడు చూసుకుందాం. అదేమన్నా పెద్ద సమస్యా? అదే జరిగితే సరైన సమాధానం సభలోనే ఇస్తా’’ అని చెప్పుకొచ్చారు. అనంతరం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో కూడా ఈ ఉదంతంపై మారి్మక వ్యాఖ్యలు చేశారు. రేణుక ‘భౌ భౌ’ ఉదంతంపై సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు పేలుతున్నాయి. ఒకరు పాపులర్ సాంగ్ ‘హూ లెట్ ద డాగ్స్ ఔట్’ ను ఎంపీ కామెంట్స్ తో రీమిక్స్ చేసి అలరించగా మరొకరు ‘ప్రాణికోటికి మన ఎంపీలు భలే సేవ చేస్తున్నారు’ అని రాసుకొచ్చారు.
రాజకీయ రచ్చ
సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు సందర్భంగా రేణుక ఒక కుక్కను భవన ప్రాంగణంలోకి తేవడం కలకలం రేపింది. అయితే, ‘దారిలో తారసపడ్డ ఒక వీధి కుక్కను తాను కాపాడి కార్లో తీసుకొచ్చా. దాన్ని వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లానని అనంతరం ఆమె చెప్పారు. పైగా, ‘కరిచేది (సభ) లోపల కూచున్నవాళ్లే. బయటుండే ఇలాంటి శునకాలు కాదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఈ శునకోదంతం రాజకీయ రచ్చకు కూడా దారి తీసింది. కుక్కలను పార్లమెంటు ఆవరణలోకి అనుమతించడం లేదు గానీ లోనికి (సభ వైపు చూపుతూ) మాత్రం రానిస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఉదంతంపై పలువులు బీజేపీ ఎంపీలు తీవ్రంగా మండిపడ్డారు.


