భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అతి పెద్ద ఘనత సాధించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్)కు తుదిరూపు ఇచ్చింది. దాని ఆకృతీకరణ (కన్ఫిగరేషన్) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా దీన్ని కీలక మైలురాయిగా శాస్త్ర సాంకేతిక లోకం వేనోళ్ల కీర్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ స్థాయి పరిశీలన కమిటీ బీఏఎస్ తుది రూపును పూర్తిస్థాయిలో పరిశీలించడం, ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. ఈ శుభవార్తను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభలో వెల్లడించారు.
ఏమిటీ బీఏఎస్?
ఇస్రో పూర్తి దేశీయ పరిజ్ఞానం సాయంతో రూపొందిస్తున్న మన సొంత అంతరిక్ష కేంద్రమిది. ఇందులో మొత్తం ఐదు మాడ్యూళ్లు ఉంటాయి. మరో పదేళ్లలో అంటే 2035 నాటికి దీన్ని ఆరంభించి కార్యకలాపాలు మొదలు పెట్టాలన్నది ఇస్రో లక్ష్యం. బీఏఎస్– 01 పేరిట మన అంతరిక్ష కేంద్రం తొలి మాడ్యూల్ అభివృద్ధికి కేంద్రం 2024లో పచ్చజెండా ఊపింది. ఫౌండేషనల్ మాడ్యూల్‌ను 2028 కల్లా ప్రయోగాత్మకంగా పూర్తిస్థాయిలో పరీక్షించి చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో ఏడాదిలోనే బీఏఎస్ నిర్మాణం పూర్తి చేయడం విశేషం. దాని తాలూకు విడి భాగాలు, ఉప వ్యవస్థలు తదితరాలన్నీ చక్కగా పని చేస్తున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో అంతర్గతంగా బీఏఎస్‌కు నిధులు తదితరాలు సమకూర్చారు. దీనికి కేటాయింపులను ఏకంగా రూ.29,193 కోట్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఎన్నెన్నో విశేషాలు...
→ బీఏఎస్ నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలన్నింటికీ అనుగుణంగా ఇస్రో పూర్తి చేసింది.
→ గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా భూ దిగువ కక్ష్య (ఎల్‌ఈఓ)లోకి మానవసహిత ఉపగ్రహాన్ని పంపాలన్న తొలి లక్ష్య సాధనలో బీఏఎస్ పాత్ర కీలకం కానుంది.
→ అంతరిక్షంలో పలు కీలక పరీక్షలు, ప్రయోగాలు కూడా బీఏఎస్ చేపట్టనుంది.
→ భారత్ సత్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవసహిత చంద్రయాన్‌లో కూడా ఇదే కీలకం కానుంది.
→ అవసరాన్ని బట్టి అత్యవసర పరిస్థితుల్లో ఇతర అంతరిక్ష కేంద్రాలతో ఎప్పటికప్పుడు అనుసంధానం అయ్యేందుకు దీంట్లో అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి.
→ బీఏఎస్‌లోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రయోగించిన కొద్ది కాలంలోనే అన్ని అంతరిక్ష కేంద్రాలకూ అది సారథిగా ఎదిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.
→ ఇతర అంతరిక్ష కేంద్రాలతో భాగస్వామ్యం దిశగా ఇస్రో ఇప్పటికే చర్చలు మొదలుపెట్టడం విశేషం
– సాక్షి, నేషనల్ డెస్క్


