కక్ష్యలోకి చేరిన 4,410 కిలోల భారీ ఉపగ్రహం
శ్రీహరికోట షార్ నుంచి ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ప్రయోగం
ఇక ఇంటర్నెట్ కనెక్టివిటీ, డీటీహెచ్ ప్రసారాల్లో మరింతమెరుగైన సేవలు
ఈ విజయం చరిత్రాత్మకమని, ఇస్రోకు గర్వకారణమని చైర్మన్ కె.నారాయణన్ వెల్లడి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో అరుదైన ఘనత సాధించింది. 4,410 కిలోల బరువైన సమాచార శాటిలైట్ సీఎంఎస్–03ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్–షార్‌లో రెండో ప్రయోగ వేదిక నుంచి లాంచ్ వెహికల్ మార్క్3(ఎల్‌వీఎం3–ఎం5) బాహుబలి రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు.
శనివారం సాయంత్రం 5.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా, సరిగ్గా 24 గంటల తర్వాత ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో ఇప్పటిదాకా ప్రయోగించిన సమాచార ఉపగ్రహాల్లో అత్యంత బరువైన ఉపగ్రహంగా సీఎంఎస్–03 రికార్డుకెక్కింది. భూమికి దూరంగా(అపోజీ) 29,970 కిలోమీటర్లు, భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కిలోమీటర్ల ఎత్తులోని దీర్ఘ వృత్తాకార జియో సింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్(భూ బదిలీ కక్ష్య)లోకి శాటిలైట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టారు.
సీఎంఎస్–03 ఉపగ్రహం కక్ష్యలోకి చేరుకుందని, సోలార్ ప్యానెల్స్ విచ్చుకున్నట్లు బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణా కేంద్రానికి సంకేతాలు అందినట్లు ఇస్రో ప్రకటించింది. ఉపగ్రహాల నియంత్రణా కేంద్రం శాస్త్రవేత్తలు సీఎంఎస్–03 శాటిలైట్‌లోని ఇంధనాన్ని నాలుగైదు దశల్లో మండించి జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ నుంచి భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని జియో ఆర్బిట్(భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెడతారు.
అక్కడి నుంచి ఉపగ్రహం సేవలు అందుబాటులోకి వస్తాయి. బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన ఎల్‌వీఎం3 వరుసగా ఎనిమిదోసారి కూడా విజయవంతం కావడం పట్ల ఇస్రో సైంటిస్టులు హర్షం వ్యక్తంచేశారు. ఎల్‌వీఎం3 రాకెట్ ఇస్రో ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసింది. ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ మూడు దశల లాంచ్ వెహికల్. ఇందులో రెండు సాలిడ్ మోటార్ స్ట్రాపాన్లు(ఎస్200), లిక్విడ్ ప్రొపలెంట్ కోర్ స్టేజ్(ఎల్110), క్రయోజెనిక్ స్టేజ్(సీ25) ఉన్నాయి. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రాకెట్ కావడం విశేషం.
బహుళ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం
ఇస్రో ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో సీఎంఎస్–03 విశిష్టమైనది. ఇది జీశాట్ సిరీస్‌లో భాగమే కావడం విశేషం. 2013లో ప్రయోగించిన జీశాట్–7 ఉపగ్రహం కాలపరిమితి పూర్తి కావడంతో దానిస్థానంలో ప్రవేశపెట్టబోతున్న జీశాట్–7ఆర్ ఉపగ్రహమే సీఎంఎస్–03. కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లోనే ఇది అత్యంత బరువైనది. 4,410 కిలోల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సాధారణంగా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు 2,000 కిలోల నుంచి 3,500 కిలోలలోపే ఉంటాయి.
సీఎంఎస్–03లో బహుళ–బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లను పేలోడ్స్‌గా అమర్చి పంపించారు. ఇది భారత భూభాగంతో సహా విస్తృత సముద్ర ప్రాంతంలో అన్ని వేళల్లో సేవలందిస్తుంది. ఇది పౌర వ్యూహాత్మక, సముద్ర వినియోగదారులకు పదునైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రస్తుతం మారిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సీఎంఎస్–03ని రూపొందించారు. ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ, డీటీహెచ్ ప్రసారాల్లో మెరుగైన సేవలను ఈ ఉపగ్రహం అందిస్తుంది. సముద్ర వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది. భారత నౌకాదళం కోసం సీఎంఎస్–03ని రూపొందించారు. కనీసం 15 ఏళ్లపాటు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రపంచంలో ఇస్రో స్థాయి పెరిగింది: కె.నారాయణన్
ఎల్‌వీఎం3–ఎం5 ప్రయోగం విజయం సాధించిన అనంతరం మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ కె.నారాయణన్ మాట్లాడారు. రాకెట్‌లోని అన్ని దశలూ అద్భుతంగా పనిచేశాయని చెప్పారు. ఈ విజయంతో ప్రపంచంలో ఇస్రో కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయని అన్నారు. ఎల్‌వీఎం3–ఎం5 విజయం చరిత్రాత్మకమని, ఇస్రోకు గర్వకారణమని వ్యాఖ్యా నించారు. అత్మనిర్భర్ భారత్‌కు ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. ఈ ఏడాది రెండు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ప్రయోగంతోపాటు ఎల్‌వీఎం3–ఎం6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నామని తెలిపారు.


