జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రవేశపెట్టిన క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత సమాచార బోర్డులు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరులోని కీలక రహదారులపై ఏర్పాటు చేసిన ఈ బోర్డులు, ఆశించిన స్థాయిలో సమాచారాన్ని అందించడం లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
ఎన్‌హెచ్‌ఏఐ ఏం చెబుతోంది?
బెంగళూరులోని ఎన్‌హెచ్-48 (బెంగళూరు-నెలమంగళ), ఎన్‌హెచ్-75 (బెంగళూరు-కోలార్-ముల్బాగల్) రూట్లలో క్యూఆర్ కోడ్ బోర్డులను ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాటు చేసింది. సాంకేతికతను ఉపయోగించుకుని వినియోగదారులకు కొన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. అత్యవసర సమాచారంలో భాగంగా హైవే పెట్రోలింగ్ బృందాలు, ఇంజినీర్లు, సమీప పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల ఫోన్ నంబర్లు ఉంటాయి. సమీపంలోని టోల్ ప్లాజాలు, మార్గమధ్యలో ఉండే మౌలిక సదుపాయాల వివరాలు ఉంటాయి.
పారదర్శకత ఎక్కడ?
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎన్‌హెచ్‌ఏఐ చెబుతున్న దానికి భిన్నంగా ఉందని వాహనదారులు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుత బోర్డులకు పొంతన లేదని వాదిస్తున్నారు.
To enhance transparency and improve ease of travel for National Highway users, NHAI is installing QR code-based information boards on key National Highway corridors in #Bengaluru. These QR boards are currently available on Bengaluru–Nelamangala section of NH-48 and… pic.twitter.com/jzgAfGQwnj
— NHAI (@NHAI_Official) December 15, 2025
ప్రయాణికులు లేవనెత్తుతున్న ప్రధానాంశాలు
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ప్రాజెక్టు వ్యయం, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పేరు, కన్సల్టెంట్ వివరాలు, స్థానిక ఎమ్మెల్యే వివరాలు కనిపించడం లేదు.
రోడ్డు నాణ్యత సరిగ్గా లేనప్పుడు ఎవరిని ప్రశ్నించాలో తెలియడం లేదని ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా కమ్యూనిటీ నోట్స్ ద్వారా వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘ప్రాజెక్ట్ కాంట్రాక్టర్, కన్సల్టెంట్, అధికారులు ఎవరో క్యూఆర్ కోడ్ ద్వారా ప్రదర్శించాలి. తద్వారా జవాబుదారీతనం పెరుగుతుంది’ అని గతంలో నితిన్ గడ్కరీ స్వయంగా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోర్టల్‌లో ఈ వివరాలు లేకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: సామాన్యుడి చేతిలో సమస్తం!


