భారత ఆటోమొబైల్ రంగంలో తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా నిస్సాన్ మోటార్ ఇండియా కీలక అడుగు వేసింది. త్వరలో లాంచ్ చేయబోతున్న కాంపాక్ట్ త్రీ-రో ఎంపీవీకి ‘గ్రావైట్’ (Gravite) అనే పేరును ఖరారు చేసినట్లు కంపెనీ గురువారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈమేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ అమియో రీజియన్ ఛైర్‌పర్సన్ మెసిమిలియనో మెస్సినా, నిస్సాన్ ఇండియా మోటార్ ఎండీ సౌరభ్‌వస్తా పాల్గొన్నారు. ఈ మోడల్‌కు సంబంధించిన కొన్ని అంశాలను పంచుకున్నారు.
కంపెనీ ప్రకటించిన రోడ్‌మ్యాప్ ప్రకారం గ్రావైట్ ఎంపీవీని జనవరి 2026లో ఆవిష్కరించునున్నారు. షోరూమ్‌ల్లో మార్చి 2026 నుంచి ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. దీని ధరల వివరాలు కూడా అప్పుడే తెలియజేస్తామని చెప్పారు. నిస్సాన్ ఇండియా నూతన ఉత్పత్తి వ్యూహంలో భాగంగా జులై 2024లో ప్రకటించిన రెండో మోడల్ ఇది. దీని తర్వాత 2026 మధ్యలో టెక్టన్ ఎస్‌యూవీని, 2027 ప్రారంభంలో మరొక 7 సీట్ల సీ-ఎస్‌యూవీని విడుదల చేయాలని నిస్సాన్ యోచిస్తోంది.
గ్రావైట్ ఎంపీవీని తమిళనాడులోని ఒరగదంలోని రెనాల్ట్-నిస్సాన్ ప్లాంట్‌లో పూర్తిస్థాయిలో స్థానికంగా తయారు చేయనున్నట్లు అమియో రీజియన్ ఛైర్‌పర్సన్ మెసిమిలియనో మెస్సినా చెప్పారు. భారత కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా దీని డిజైన్ ఉంటుందన్నారు. ఆటోమొబైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ కంపెనీకు ప్రధాన మార్కెట్ అని చెప్పారు.

నిస్సాన్ ఇండియా మోటార్ ఎండీ సౌరభ్‌వస్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో 7-సీటర్ ఆప్షన్‌గా ఈ మోడల్ నిలవనుంది. ఇండియాలో కంపెనీ వేగంగా వృద్ధి చెందాలని భావిస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో లాంచ్ అయిన మాగ్నైట్, త్వరలో లాంచ్ కానున్న టెక్టాన్, గ్రావైట్ మోడళ్ల ఆవిష్కరణ అందుకు నిదర్శనం. భవిష్యత్తులో భారత్‌లో నిస్సాన్ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువయ్యేలా చేసేందుకు కంపెనీ 100 షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థానిక వినియోగదారుల అవసరాలను తీర్చేలా, కస్టమర్లకు నచ్చే డిజైన్లలో ఉత్పత్తులను అందిస్తున్నాం. ఈ క్రమంలో టెక్నాలజీని వాడుతున్నాం. అదే సమయంలో వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం’ అన్నారు.
డిజైన్, ఫీచర్లు
నిస్సాన్ విడుదల చేసిన టీజర్ చిత్రాల ప్రకారం కొత్త గ్రిల్, ఫ్రంట్, రియర్ బంపర్లు, అప్‌డేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్ (LED ల్యాంప్స్), అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బానెట్, టెయిల్‌గేట్‌పై స్పష్టంగా కనిపించే ‘గ్రావైట్’ బ్యాడ్జింగ్ ఉంది. ఇంటీరియర్ గురించి అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మెరుగైన క్యాబిన్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.
ఇదీ చదవండి: డ్రైవర్ల పంట పండించే ‘భారత్ ట్యాక్సీ’


