భారత అంతర్జాతీయ విధానంలో ఉన్న లోపాలేంటి?
విద్యాపరంగా పరిమితులేంటి?
ఫారిన్ ట్రేడ్ నిపుణులు డా.మురళీదర్శన్ విశ్లేషణ
సాక్షి డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
భారత రూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రోజురోజుకూ తగ్గిపోతోంది. మరోవైపు జీడీపీపరంగా భారత్ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఐదో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. మరి జీడీపీలో పురోగతి సాధిస్తున్నా రూపాయి పతనం ఎందుకు.. భారత అంతర్జాతీయ విధానంలో ఉన్న లోపాలేంటి.. విద్యాపరంగా పరిమితులేంటి.. తదితర అంశాలను వివరంగా విశ్లేషించారు ఫారిన్ ట్రేడ్ నిపుణులు, హైదరాబాద్‌కు చెందిన డా.మురళీదర్శన్. సాక్షి డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానం
అంతర్జాతీయ సంబంధాలు, దౌత్యం చాలా విస్తృతమైన అంశం. ప్రతి దేశం మనతో స్నేహంగా ఉంటుందని ఆశించకూడదు. అధిక టారిఫ్‌లు భారత ఎగుమతులను బలహీనపరుస్తున్నాయి. అనేక విదేశీ కంపెనీలు భారత్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. దీని వల్ల రూపాయి విలువ పడిపోవడం, ఎగుమతులు తగ్గడం జరుగుతోంది.
రూపాయి విలువ.. జీడీపీ
జీడీపీకి (స్థూల దేశీయోత్పత్తి) రూపాయి విలువకు ప్రత్యక్ష సంబంధం లేదు. జీడీపీ అనేది దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ. ఎగుమతులు, దిగుమతుల వ్యత్యాసం, విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు వంటివి రూపాయి విలువ ప్రభావితమయ్యే కీలక అంశాలు. దిగుమతులపై ఎక్కువ ఆధారపడితే రూపాయి బలహీనమవుతుంది.
ఎగుమతుల లోపాలు
భారత ఎగుమతులు ప్రధానంగా సాఫ్ట్‌వేర్, ఔషధ రంగంపై ఆధారపడి ఉన్నాయి. కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ప్రతి దేశానికి అనుగుణంగా ఎగుమతి విధానాలు మార్చుకోవాలి.
పరిమిత విద్యా వ్యవస్థ
భారతదేశంలో నాణ్యమైన పరిశోధనా సంస్థలు చాలా పరిమితంగా ఉన్నాయి. దీంతో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు తిరిగి రావడం లేదు. దీనివల్ల దేశానికి మేథో నష్టం జరుగుతోంది. ఒకప్పుడు నలంద, తక్షశిల వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు మనవే. ఇప్పుడు మళ్లీ అలాంటి విద్యా ప్రమాణాలు తీసుకురావాలి.
పాలనలో మేధావుల పాత్ర
రాజకీయాల్లో, విధాన నిర్ణయాల్లో నిపుణుల అవసరం ఉంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే ఏకాధిపత్యం రాజ్యమేలుతుంది. ప్రస్తుతం 2% మంది వద్ద 98% సంపద ఉంది. సహజ వనరులను ప్రజల సంక్షేమానికి వినియోగించాలి.
ఉపాధి అవకాశాలు, సహజ వనరులు
భారతదేశానికి విశాలమైన తీరప్రాంతం ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం తీరాలు ఉన్నాయి. నౌకల మరమ్మత్తులు, నిర్వహణ ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఉపగ్రహ మ్యాపింగ్ సేవలను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయవచ్చు.
విలువ జోడింపు అవసరం
ఏ ఉత్పత్తికైనా విలువ జోడింపు అవసరం. ఉదాహరణకు టమాటాలు పండించే రైతులు సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతుంటారు. వారు వాటిని సాస్ లేదా కేచప్లుగా మార్చి ఎగుమతి చేస్తే మంచి లాభం వస్తుంది. అలాగే కాఫీ, రఫ్ డైమండ్స్ కూడా. ఉత్పత్తికి విలువ జోడిస్తే ఉపాధి లభిస్తుంది. విదేశీ మారకం ద్రవ్యం పెరుగుతుంది.
స్టార్టప్స్, పరిశోధన
పరిశోధనా సంస్థలు పరిశ్రమలకు సహకరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ వినియోగించాలి. విదేశీ టెక్నాలజీని దేశీయ అవసరాలకు అనుసంధానం చేయాలి. స్టార్టప్స్‌కు సరైన విధాన మద్దతు ప్రభుత్వాల నుంచి అందించాల్సిన అవసరం ఉంది.
యువతకు సందేశం
అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న కోర్సులు ఎంచుకోండి. విద్య, పరిశోధన, వ్యాపారంపై దృష్టి పెట్టండి. మంచి నాయకులను ఎన్నుకోండి. యువత శక్తితో వ్యవస్థను మార్చవచ్చు. దేశ అభివృద్ధికి మీ జ్ఞానాన్ని వినియోగించండి. భారతదేశానికి గొప్ప చరిత్ర ఉంది. అపారమైన మానవ వనరులు ఉన్నాయి. కావాల్సిందల్లా దూరదృష్టి ఉన్న నాయకత్వం, నాణ్యమైన విద్య, కొత్త మార్కెట్లు, విలువ జోడింపు, సమాన అభివృద్ధి.
డా.మురళీదర్శన్ మనోగతం మరింత వివరంగా చూడండి.. ఈ కింది వీడియోలో..


