సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వాహనంలోకి సులువుగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా తమ వ్యాగన్‌ఆర్ కారులో స్వివల్ సీట్ ఆప్షన్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది.
రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందన కంపెనీ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. వ్యాగన్‌ఆర్ స్వివల్ సీటు .. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ (ఏఆర్‌ఏఐ) భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. అసమానతలను తొలగించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన పర్యావరణహిత అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ఇది ముందడుగని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 11 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 200కు పైగా మారుతీ సుజుకి అరేనా డీలర్‌షిప్‌లలో ఈ స్వివల్ సీటు ఏర్పాటు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త వ్యాగన్‌ఆర్ కార్లకు అలాగే ఇప్పటికే ఉన్న కార్లకు కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్, 3 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం మారుతీ సుజుకి, ఎన్‌ఎస్‌ఆర్‌సీఈఎల్- ఐఐఎం బెంగళూరు స్టార్టప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ కింద బెంగళూరుకు చెందిన ట్రూఅసిస్ట్ టెక్నాలజీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులు వ్యాగన్‌ఆర్ స్వివెల్ సీట్‌ను రెట్రోఫిట్ కిట్‌గా అరేనా డీలర్‌షిప్‌లలో ఆర్డర్ చేయవచ్చు. వాహనం నిర్మాణం లేదా ప్రాథమిక పనితీరులో ఎటువంటి మార్పులు చేయకుండా ఈ సీటును అమర్చుతారు.
టాల్ బాయ్ డిజైన్ కలిగిన వ్యాగన్‌ఆర్.. విశాలమైన హెడ్‌రూమ్, లెగ్‌రూమ్‌తో ఈ ఇన్నోవేటివ్ మొబిలిటీ సొల్యూషన్‌కు అత్యంత అనుకూలంగా నిలుస్తుంది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతి సుజుకీ మోడళ్లలో వ్యాగన్‌ఆర్ ఒకటి.


