టెక్నాలజీ ఆధారిత స్టార్టప్ రావిటీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 7.84 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు మారుతీ సుజుకీ ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా రూ. 2 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. రావిటీ కనెక్టెడ్ మొబిలిటీ ఇన్‌సైట్స్‌లో ప్రత్యేకతను కలిగి ఉన్నట్లు పేర్కొంది.
ఈ ఫండ్ ద్వారా మారుతీ ఇంతక్రితం రెండుసార్లు దాదాపు రూ. 2 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసింది. 2024 మార్చిలో ఏఎంఎల్‌గో ల్యాబ్స్‌లో, 2022 జూన్‌లో సోషియోగ్రాఫ్ సొల్యూషన్స్‌లోనూ వాటా కొనుగోలు చేసింది. అత్యున్నతస్థాయి ఆవిష్కరణలకు తెరతీస్తున్న స్టార్టప్‌లలో ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ తెలియజేసింది.
కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన స్టార్టప్‌లవైపు దృష్టి పెడుతున్నట్లు తెలియజేసింది. కాగా.. మారుతీ పెట్టుబడుల నేపథ్యంలో ఏఐ, అనలిటిక్స్, మొబిలిటీలో కంపెనీకున్న సామర్థ్యం, నైపుణ్యాలను మరింత మెరుగుపరచేందుకు కట్టుబడి ఉన్నట్లు రావిటీ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు వికాస్ రుంగ్తా పేర్కొన్నారు.
కాగా మారుతీ సుజుకీ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో 1.2 శాతం బలపడి రూ. 15,980 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 16,150ను తాకింది.


