ఐదేళ్లలో హైరింగ్ 13% అప్
డిపాజిట్లు 33 శాతం జంప్
రుణాలు 24 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: పేరుకు చిన్నవే అయినా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ) వేగంగా వృద్ధి చెందుతున్నాయి. గత అయిదేళ్లలో నియామకాలు, డిపాజిట్లు, రుణాల కార్యకలాపాల్లో ముందుకెళ్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌ఎఫ్‌బీల్లో 95,249గా ఉన్న సిబ్బంది సంఖ్య వార్షికంగా 13.3 శాతం వృద్ధితో 2025 ఆర్థిక సంవత్సరంలో 1.8 లక్షలకు పెరిగింది. ఇదే వ్యవధిలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.3 శాతం వార్షిక వృద్ధితో 18.1 లక్షలకు చేరింది. 2026 ఆర్థిక సంవత్సరంలోనూ ఎస్‌ఎఫ్‌బీల్లో నియామకాల జోరు కొనసాగింది.
11 ఎస్‌ఎఫ్‌బీలకు గాను ఎనిమిది లిస్టెడ్ బ్యాంకులు ప్రథమార్ధంలో దాదాపు 9,000 మందిని తీసుకున్నాయి. 2020–25 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) సిబ్బంది సంఖ్య 0.8 శాతం తగ్గగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 8.6 శాతం పెరిగింది. మరోవైపు, 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఎస్‌ఎఫ్‌బీల రుణాలు రూ. 94,441 కోట్ల నుంచి 24.2 శాతం పెరిగి రూ. 2,78,564 కోట్లకు ఎగిశాయి. అటు బ్యాంక్ డిపాజిట్లు కూడా రూ. 62,667 కోట్ల నుంచి 33.5 శాతం పెరిగి రూ. 2,65,586 కోట్లకు చేరాయి.
చిన్న సంస్థలకు పీఎస్‌బీ రుణాల దన్ను
మరోవైపు, పీఎస్‌బీల దన్నుతో 2025 జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) గణనీయంగా కొత్త రుణాలు లభించినట్లు క్రిసిల్ ఇంటెలిజెన్స్ ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, ఎంఎస్‌ఎంఈలకు అదనంగా ఇచ్చిన రుణాలు గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 17.7 శాతంతో పోలిస్తే 32.5 శాతానికి పెరిగినట్లు వివరించింది. మొత్తం రుణాల్లో ఎంఎస్‌ఎంఈల వాటా 1.72 శాతం మేర పెరిగింది. సురక్షితమైన సెక్యూర్డ్ క్రెడిట్ వైపు మొగ్గు చూపుతూ పీఎస్‌బీలు గణనీయంగా రుణాలివ్వడం ఇందుకు తోడ్పడింది. అలాగే ఎంఎస్‌ఎంఈల నిర్వచనంలో మార్పులు కూడా అధిక రుణ వితరణకు కారణంగా నిల్చినట్లు నివేదిక పేర్కొంది. అన్‌సెక్యూర్డ్ వ్యాపార రుణాల్లో అసెట్ నాణ్యత కాస్త క్షీణించినప్పటికీ మొత్తం ఎంఎస్‌ఎంఈ రుణాల పోర్ట్‌ఫోలియో పరిస్థితి సంతృప్తికరంగానే ఉన్నట్లు వివరించింది.
యూనివర్సల్ లైసెన్సుపై దృష్టి..
ఎస్‌ఎఫ్‌బీలు భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తూ, యూనివర్సల్ లైసెన్సుపై దృష్టి పెట్టాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. లైసెన్సు రావడానికి ముందుగానే సర్వసన్నద్ధంగా ఉండేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపాయి. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్లలోను శాఖలను చురుగ్గా విస్తరిస్తున్నాయని పేర్కొన్నాయి. ఇలాంటి మార్కెట్లలో టెక్నాలజీ వినియోగం పరిమితంగా ఉంటుంది కాబట్టి సిబ్బంది సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా హైరింగ్‌ని కూడా పెంచుకుంటున్నాయి. ఇటీవలే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కి యూనివర్సల్ బ్యాంక్‌గా లైసెన్సు వచి్చంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గతేడాది లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకూ లైసెన్సుపై ఆసక్తిగా ఉంది.


