స్టీల్‌కు పెరగనున్న డిమాండ్‌ | Steel demand in India to grow at 8 pc in FY26 ICRA | Sakshi
Sakshi News home page

స్టీల్‌కు పెరగనున్న డిమాండ్‌

Dec 18 2025 7:47 AM | Updated on Dec 18 2025 7:50 AM

Steel demand in India to grow at 8 pc in FY26 ICRA

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో స్టీల్‌కు డిమాండ్‌ 8 శాతం పుంజుకోనున్నట్లు రేటింగ్‌ దిగ్గజం ఇక్రా అంచనా వేసింది. అయితే పోటీధరల కారణంగా స్టీల్‌ తయారీ కంపెనీల మార్జిన్లపై ఒత్తిళ్లకు అవకాశమున్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. స్టీల్‌ పరిశ్రమ నిర్వహణలాభ మార్జిన్‌ నిలకడగా 12.5 శాతం స్థాయిలో నమోదుకావచ్చని అభిప్రాయపడింది. వెరసి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు గతంలో వేసిన అంచనాలను సవరించింది.

కాగా.. ఈ ఏడాది స్టీల్‌ డిమాండ్‌ 8 శాతం స్థాయిలో పటిష్టంగా నమోదుకావచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా కార్పొరేట్‌ రంగ రేటింగ్స్‌ గ్రూప్‌ హెడ్‌ గిరీష్‌కుమార్‌ కడమ్‌ తెలియజేశారు. అయితే సరఫరాలు పెరగనుండటంతో తాత్కాలికంగా డిమాండును మించి సరఫరాకు వీలున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా స్టీల్‌ ధరలపై ఒత్తిళ్లు కొనసాగవచ్చని తెలియజేశారు.  

సేఫ్‌గార్డ్‌ డ్యూటీ రక్షణ 
ఇక్రా నివేదిక ప్రకారం దేశీయంగా హాట్‌రోల్డ్‌ కాయిల్‌(హెచ్‌ఆర్‌సీ) ధరలు 2025 ఏప్రిల్‌లో టన్నుకి రూ. 52,850కు ఎగశాయి. సేఫ్‌గార్డ్‌ డ్యూటీ విధింపు ఇందుకు సహకరించింది. ఆపై నవంబర్‌కల్లా టన్ను ధర తిరిగి రూ. 46,000కు దిగివచ్చింది. దిగుమతి ధరలకంటే దిగువకు చేరింది. వ్యవస్థాగత అంశాల కారణంగా ప్రస్తుత కేలండర్‌ ఏడాది(2025) తొలి 9 నెలల్లో చైనా స్టీల్‌ ఎగుమతులు 8.8 కోట్ల టన్నులను తాకాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. దీంతో ప్రపంచ స్టీల్‌ ధరలపై ప్రతికూల ప్రభావం పడింది.

ఈ ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో చైనా హెచ్‌ఆర్‌సీ ఎగుమతి ధరలు సగటున టన్నుకి 465 యూఎస్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఏడాదిక్రితం నమోదైన 496 డాలర్లతో పోలిస్తే 6 శాతం తగ్గాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఫినిష్‌డ్‌(తుది ఉత్పత్తి) స్టీల్‌ దిగుమతులు వార్షికంగా 33 శాతం క్షీణించాయి. దీంతో చౌక దిగుమతులను అడ్డుకునేందుకు సేఫ్‌గార్డ్‌ డ్యూటీ కొనసాగింపు కీలకమని ఇక్రా పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం దేశీ హెచ్‌ఆర్‌సీ ధరలు 2026 మార్చివరకూ సగటున టన్నుకి రూ. 50,500గా కొనసాగే వీలున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా టన్ను స్టీల్‌ ఉత్పత్తిపై నిర్వహణ లాభం గతేడాది(2024–25)లో నమోదైన 110 డాలర్ల నుంచి 108 డాలర్లకు నీరసించవచ్చని తెలియజేసింది. వెరసి స్టీల్‌ రంగానికి నిలకడతోకూడిన ఔట్‌లుక్‌ ప్రకటించింది.

సామర్థ్య విస్తరణ ఎఫెక్ట్‌ 
దేశీయంగా స్టీల్‌ పరిశ్రమలో భారీ సామర్థ్య విస్తరణ ప్రణాళికలు అమలవుతున్న కారణంగా రిసు్కలు పెరగవచ్చని ఇక్రా తాజా నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం 2026–31 మధ్య కాలంలో దేశీ స్టీల్‌ పరిశ్రమలు 8–8.5 కోట్ల టన్నుల స్టీల్‌ తయారీ సామర్థ్యాన్ని అదనంగా జత కలుపుకునే ప్రణాళికలు అమలు చేయనున్నాయి. ఇందుకు 4.5–5 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 45,000 కోట్లు) పెట్టుబడులు వెచి్చంచనున్నాయి. అయితే తగినస్థాయిలో విక్రయాలు, ఆర్జన మెరుగుపడకపోతే భారీ పెట్టుబడుల కారణంగా మధ్యకాలానికి స్టీల్‌ పరిశ్రమ రుణభారం పెరిగిపోయే అవకాశముంది.

ఇక మరోపక్క దేశీయంగా మొత్తం డిమాండ్‌లో గ్రీన్‌ స్టీల్‌ వాటా 2029–30 కల్లా 2 శాతానికి(4 మిలియన్‌ టన్నులు) బలపడవచ్చని గ్రీన్‌ స్టీల్‌పై గిరీ‹Ùకుమార్‌ స్పందించారు. ఈ బాటలో 2049–50కల్లా దాదాపు 40 శాతానికి(150 ఎంటీ)కి చేరవచ్చని అంచనా వేశారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ ధరలు కేజీకి 1.5–1.6 డాలర్లకు క్షీణిస్తేనే గ్రీన్‌ స్టీల్‌ తయారీ ఊపందుకుంటుందని తెలియజేశారు. అయితే సమీప భవిష్యత్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ ధరలు దిగిరాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement