
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన హోల్‌సేల్(టోకు) అమ్మకాల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో 1–4 శాతంగా ఉండొచ్చని ఇక్రా రేటింగ్ సంస్థ అంచనా వేసింది. అధిక ఇన్వెంటరీ, ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే ‘రేర్ ఎర్త్ మాగ్నెట్’ వంటి కీలక ఉపకరణాల కొరత విక్రయాలపై ప్రభావాన్ని చూపొచ్చని పేర్కొంది.
అంతకు ముందు.. ఇదే ఎఫ్‌వై 26లో అమ్మకాల వృద్ధి 4–7% ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చర్లు(ఓఈఎం)నుంచి స్థిరమైన మోడళ్ల ఆవిష్కరణలు పరిశ్రమ అమ్మకాలకు పాక్షిక మద్దతునిస్తాయని వివరించింది.
మే అమ్మకాలు డిమాండ్ క్షీణతకు సంకేతాలు
భారత్ – పాకిస్థాన్ యుద్ధంతో ఉత్తర భారతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు కస్టమర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా ఈ ఏడాది మే నెలలో 3,02,214 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే ఏడాది ఏప్రిల్ అమ్ముడైన 3,49,939 యూనిట్లతో పోలిస్తే ఇవి 13.6% తక్కువ. ఈ అమ్మకాలు డిమాండ్ క్షీణతకు సంకేతాలని ఇక్రా తెలిపింది.
టూ వీలర్స్‌కు ‘గ్రామీణం’ దన్ను
ఇదే ఎఫ్‌వై 26లో ద్విచక్రవాహన అమ్మకాల వృద్ధి 6–9 శాతంగా ఉండొచ్చని తెలిపింది. స్థిరమైన గ్రామీణ ఆదాయాలు, సాధారణ వర్షపాత నమోదు, పట్టణ మార్కెట్ పెరగడం తదితర అంశాలు టూ వీలర్స్‌కు డిమాండ్‌ను పెంచుతాయి. గ్రామీణ డిమాండ్, మెరుగైన సాగుతో ద్విచక్రవాహన రిటైల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదిన 7% వృద్ధి సాధించాయి.