
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ద్విచక్ర వాహన విక్రయాలు 6–9% పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. స్థిరమైన రిప్లేస్‌మెంట్(పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం), పట్టణ ప్రాంతాల్లో వినియోగ రికవరీ, సాధారణ వర్షపాతం నమోదుతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరగడం, జీఎస్‌టీ రేట్ల తగ్గింపు తదితర అంశాలు అమ్మకాల వృద్ధికి తోడ్పడతాయని రేటింగ్ సంస్థ తెలిపింది.
‘పరిశ్రమ అవుట్‌లుక్ ఇప్పట్టకి సానుకూల వైఖరి కలిగి ఉంది. స్థిరమైన డిమాండ్ ఉతమిస్తుంది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు అంశం వృద్ధి వేగవంతం కావడానికి అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది’ అని పేర్కొంది. పండుగ సీజన్‌కు ముందు ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మానుఫ్యాక్చరర్లు (ఓఈఎంలు) డీలర్లకు బలమైన పంపిణీ కారణంగా ఈ జూలైలో టూ వీలర్స్ హోల్‌సేల్ అమ్మకాలు 9% వృద్ధితో 15 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే జూలైలో రిటైల్ అమ్మకాలు 6.5% క్షీణించాయి. పట్టణ ప్రాంతంలో డిమాండ్ స్తబ్ధత, అధిక వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణమని పేర్కొంది. ఎగుమతుల వృద్ధి సైతం కొనసాగొచ్చని తెలిపింది. రాబోయే పండుగ సీజన్ నాటికి రిటైల్ డిమాండ్ పుంజుకోవచ్చని రేటింగ్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది.
ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?