ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో బాండ్ల ద్వారా రూ. 12,500 కోట్లు సమీకరించనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఈటీవల క్విప్ (క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్) మార్గంలో జూలైలో రూ. 25,000 కోట్ల ఈక్విటీ క్యాపిటల్ సమకూర్చుకున్నామని వివరించారు. ఇది రూ. 12 లక్షల కోట్ల రుణ వృద్ధికి తోడ్పడుతుందని, వచ్చే 5–6 ఏళ్ల పాటు క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తిని 15 శాతం స్థాయిలో కొనసాగించేందుకు సరిపోందని ఆయన చెప్పారు. క్విప్‌కి ముందు సైతం తమకు నిధుల సమీకరణ సమస్యేమీ ఉండేది కాదని పేర్కొన్నారు.
మరోవైపు వచ్చే వారం పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేటును 0.25 శాతం తగ్గించినా ఇబ్బందేమీ లేకుండా తమ నికర వడ్డీ మార్జిన్ (నిమ్) గైడెన్స్ 3 శాతం స్థాయిని సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వాస్తవ జీడీపీ వృద్ధి 7.5 శాతంగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అధిక వృద్ధి రేటు సాధిస్తున్నప్పుడు కీలక పాలసీ రేట్లను ఎందుకు తగ్గించాల్సి వస్తోందనేది వివరించడమనేది ఆర్‌బీఐకి సవాలుగా ఉండొచ్చని శెట్టి తెలిపారు. అయితే ద్రవ్యోల్బణం నెమ్మదిస్తుండటా న్ని చూస్తే రేట్లను తగ్గించేందుకే అవకాశాలున్నట్లు తెలుస్తోందన్నారు.


