లిస్టులో ఎస్‌బీఐ, మరో రెండు ప్రైవేట్ బ్యాంకులు
2030 నాటికి సాధ్యమే: ఎస్‌బీఐ చీఫ్ శెట్టి వెల్లడి
ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా 2030 నాటికి అంతర్జాతీయంగా టాప్ 10 బ్యాంకుల్లో మూడు భారతీయ బ్యాంకులు ఉంటాయని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి చెప్పారు. ప్రభుత్వ రంగ దిగ్గజమైన తమ బ్యాంకుతో పాటు మరో రెండు ప్రైవేట్ బ్యాంకులు వీటిలో ఉంటాయని వివరించారు. ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ 100 బిలియన్ డాలర్ల స్థాయిని తాకిందని, అలాగే ప్రైవేట్ రంగంలోనూ మరో రెండు బ్యాంకుల వేల్యుయేషన్ భారీ స్థాయిలో ఉందని చెప్పారు.
నిర్దిష్టంగా పేర్లు ప్రస్తావించనప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ని ఉద్దేశించి శెట్టి ఈ విషయం చెప్పారని భావిస్తున్నారు. కన్సాలిడేషన్ ద్వారా భారీ బ్యాంకులను సృష్టించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాపార పరిమాణంపరంగా ఎస్‌బీఐ ప్రస్తుతం అంతర్జాతీయంగా 43వ స్థానంలో ఉంది. ఎస్‌బీఐలో చేరేందుకు ఇంజినీర్ గ్రాడ్యుయేట్లు బాగా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సిబ్బందికి టెక్నాలజీ శిక్షణకు వెచి్చంచే సమయం గణనీయంగా తగ్గుతోందని ఆయన పేర్కొన్నారు.
అందుకే నిబంధనలు సరళతరం: ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా
అప్రమత్తంగా ముందుకెళ్తూనే, కొంత సాహసోపేతంగా వ్యవహరించాల్సిన అవసరం నెలకొన్నందునే బ్యాంకింగ్ నిబంధనలను సరళతరం చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షించడం ఆర్‌బీఐ ఉద్దేశం కాదన్నారు. పనితీరు, గవర్నెన్స్‌ను మెరుగుపర్చుకోవడం వల్లే బ్యాంకులకు మరింతగా బాధ్యతలను అప్పగిస్తున్నట్లు మల్హోత్రా చెప్పారు.
తప్పుగా వ్యవహరిస్తే కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ దగ్గర అనేక సాధనాలు ఉన్నాయన్నారు. స్వల్పకాలిక వృద్ధి వెనుక పరుగులు తీస్తూ ఆరి్థక స్థిరత్వం విషయంలో రాజీ పడితే, దీర్ఘకాలిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. రెగ్యులేటర్ పాత్రనేది తోటమాలిలాగా ఉంటుందని ఆయన అభివరి్ణంచారు. మొక్కల (బ్యాంకింగ్ వ్యవస్థ) పెరుగుదలను పర్యవేక్షిస్తూనే, అనవసరమైన వాటిని కత్తిరిస్తూ, ఉద్యానవనం ఒక పద్ధతిగా, అందంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సెంట్రల్ బ్యాంకుపై ఉంటుందని మల్హోత్రా పేర్కొన్నారు.
డిజిటల్ మోసాలు పెరిగాయ్
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి. రవిశంకర్
ఈ ఏడాది జూలై వరకు కొంత నెమ్మదించిన డిజిటల్ మోసాలు, ఆ తర్వాత నుంచి గణనీయంగా పెరుగుతున్నాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి. రవిశంకర్ తెలిపారు. బహుశా సీజనల్ లేదా ఇతరత్రా అంశాలేవైనా ఇందుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా మోసాల పెరుగుదల వెనుక కారణాలను ఆర్‌బీఐ పరిశీలిస్తోందన్నారు. ఫ్రాడ్ ద్వారా వచ్చే డబ్బును మళ్లించేందుకు ఉపయోగిస్తున్న అకౌంట్లను గుర్తించేందుకు మ్యూల్ హంటర్‌లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తోందని రవిశంకర్ వివరించారు. మరోవైపు, చెల్లింపుల వ్యవస్థ విషయానికొస్తే కొన్ని పరిమితులరీత్యా యూపీఐ సామర్థ్యాలను బ్యాంకులు అంచనా వేయలేకపోయాయని, కానీ ఫిన్‌టెక్ సంస్థలు మాత్రం అవకాశాలను అందిపుచ్చుకున్నాయని చెప్పారు.


