ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించినా సరే
ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ ఎంపీసీ డిసెంబర్ సమీక్షలో రెపో రేటును పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తాము పెట్టుకున్న 3 శాతం నికర వడ్డీ మార్జిన్ (నిమ్) లక్ష్యాన్ని సాధిస్తామని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో రేటు కోత ఉంటే, అది పావు శాతం మించకపోవచ్చన్నది తమ అంచనా అని చెప్పారు. దీనివల్ల తమ మార్జిన్లపై పెద్ద ప్రభావం ఉండదన్నారు.
రేటు తగ్గింపునకు అవకాశం ఉందని, ఈ విషయాన్ని గత సమీక్ష సందర్భంగానే పేర్కొన్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ వారం మొదట్లో ప్రకటించడం గమనార్హం. దినికితోడు స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో వచ్చే ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో రేట్ల కోత ఉంటుందన్న అంచనాలు పెరిగిపోయాయి. సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.5 శాతంగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2025–26) 7 శాతంగా ఉండొచ్చని శెట్టి అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధి రేటు, సానుకూల ద్రవ్యోల్బణం పరిస్థితులతో రేట్ల కోతకు అవకాశాలున్నట్టు చెప్పారు.
పలు మార్గాలున్నాయ్..
ఆర్‌బీఐ ఈ ఏడాది ఒక శాతం వరకు రేట్లు తగ్గించడంతో మార్జిన్లను కాపాడుకోవడం బ్యాంకులకు సవాలుగా మారిన తరుణంలో.. తన మార్జిన్లను కాపాడుకునేందుకు ఎస్‌బీఐకి పలు చోదకాలున్నట్టు శెట్టి పేర్కొన్నారు. ‘‘సీఆర్‌ఆర్ ఒక శాతం కోత పూర్తిగా అమల్లోకి రావడంతో దీనివల్ల వడ్డీ ఆదాయం మెరుగవుతుంది. రుణాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. గడువు ముగిసే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కొత్త వడ్డీ రేట్లు అమలు చేయడంతోపాటు, సేవింగ్స్ డిపాజిట్లపై 0.2 శాతం వడ్డీ రేటు తగ్గించడం వల్ల మార్జిన్ల పరంగా ప్రయోజనం కలుగుతుంది’’అని శెట్టి వివరించారు. ఎస్‌బీఐ ఆస్తుల్లో కేవలం 30 శాతమే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆఫ్ రెపో రేటుతో అనుసంధామైనవిగా చెప్పారు. దీనివల్ల ఆర్‌బీఐ రేట్ల కోత చేపట్టినప్పుడు మూడింట ఒక వంతు రుణాల రేట్లను మార్చాల్సి వస్తుందని, దీంతో మార్జిన్లపై ఒత్తిడి పరిమితంగానే ఉంటుందని వివరించారు. సెపె్టంబర్ త్రైమాసికంలో ఎస్‌బీఐ నిమ్ 2.93 శాతంగా
ఉండడం గమనార్హం.


