మోసాలను కట్టడి చేసే దిశగా ఫైనాన్షియల్ వ్యవస్థలోని అన్ని భాగాలను అనుసంధానం చేసేలా జాతీయ ఫైనాన్షియల్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రతిపాదించారు. ఇందులో క్రెడిట్ బ్యూరోలు, ఫ్రాడ్ రిజిస్ట్రీలు, ఈ–కేవైసీ సదుపాయాలు, ఏకీకృత చెల్లింపుల ప్లాట్‌ఫాం, అకౌంట్ అగ్రిగేటర్లు మొదలైన వర్గాలు ఉండొచ్చని చెప్పారు.
సీఐఐ ఫైనాన్సింగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలన్నీ కలిసి ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ పేరిట లాభాపేక్షరహిత సంస్థను ఏర్పాటు చేయొచ్చని శెట్టి చెప్పారు. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా పరిశ్రమ భాగస్వాములకు రియల్–టైమ్‌లో డేటాను అందించగలిగే ఉమ్మడి డిజిటల్ మౌలిక సదుపాయంగా ఇది ఉండాలని పేర్కొన్నారు.
మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో టెక్నాలజీ వ్యవస్థను సమీక్షించాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ ఆశీష్ పాండే చెప్పారు. ఉద్యోగులకు నైపుణ్యాల్లో శిక్షణనివ్వడం మొదలైనవి పరిశ్రమకు కీలక సవాళ్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు.


